యంనంపీట్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
ఘట్‌కేసర్, ఆంధ్రప్రభ : మేడ్చల్-మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్‌కేసర్ సర్కిల్, పోచారం డివిజన్‌లోని యంనంపేటలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రభ గత రెండు నెలలుగా వరుస కథనాలు ప్రచురించింది. ఈ కథనాలకు స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి, ఘట్‌కేసర్ సర్కిల్ అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
దీంతో మంగళవారం ఉదయం సర్కిల్ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అయితే యంనంపేటలో ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటారా, లేక సాధారణంగా కొంతవరకు మాత్రమే కూల్చివేతలు నిర్వహించి ఆగిపోతారా అన్నది చూడాల్సి ఉంది.
ప్రభుత్వానికి లక్షలాది రూపాయల నష్టం కలిగించేలా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే కూల్చివేతలు ప్రారంభించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
