ఇద్దరు నాటుసారాయి నేరస్తులపై పీడీ చట్టం ప్రయోగం…
ఇద్దరు నాటుసారాయి నేరస్తులపై పీడీ చట్టం ప్రయోగం…
కలెక్టర్ ఉత్తర్వులు…
కడప కేంద్ర జైలుకు తరలింపు…
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో నాటుసారాయి అక్రమ వ్యాపారంపై కట్టడి చర్యల్లో భాగంగా ఇద్దరు పేరుమోసిన నేరస్తులపై పీడీ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎక్సయిజ్ శాఖ సూపరిండెంట్ ఏం సుధీర్ ఆదివారం వెల్లడించారు. జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ సిరి ఐఏఎస్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పత్తికొండ ఎక్సయిజ్ స్టేషన్ పరిధిలోని మద్దికేర గ్రామం, మౌమిన్ వీధికి చెందిన నాగప్ప కుమారుడు (42)పై ఏపీ కల్తీ మద్యం వ్యాపారులు, బందిపోట్లు, మాదకద్రవ్య నేరస్థులు, గూండాలు, అనైతిక రవాణా నేరస్థులు, భూకబ్జాదారుల ప్రమాదకర కార్యకలాపాల నివారణ చట్టం–1986 సెక్షన్ 3(1) కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వులను మే 2న పత్తికొండ ఎక్సయిజ్ ఇన్స్పెక్టర్ సువర్ణలత అమలు చేసి, నిందితుడిని కడప కేంద్ర జైలుకు తరలించారు. అదేవిధంగా, కర్నూలు ఎక్సయిజ్ స్టేషన్ పరిధిలోని కల్లూరు మండలం కొల్లంపల్లి తండాకు చెందిన తెలుగు రామదాసు (43)పై కూడా అదే చట్టంలోని సెక్షన్ 3(1) కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను మే 3న కర్నూలు ఎక్సయిజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ అమలు చేసి, నిందితుడిని కడప కేంద్ర పురుషుల జైలుకు అప్పగించారు.
ఇద్దరు నేరస్తులపై పీడీ చట్టం ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన అసిస్టెంట్ ఎక్సయిజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, ఈఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, పత్తికొండ, కర్నూలు ఇన్స్పెక్టర్లు సువర్ణలత, చంద్రహాస్లను ఎక్సయిజ్ సూపరింటెండెంట్ ఎం. సుధీర్ బాబు అభినందించారు.
