నేడు రైతు వారోత్సవ కార్యక్రమం
నేడు రైతు వారోత్సవ కార్యక్రమం
కేసముద్రం, మే 3 (ఆంధ్రప్రభ): రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, ఆధునిక వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహం లక్ష్యంగా 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సోమవారం నుండి వారం రోజులపాటు ‘రైతు వారోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తోందని కేసముద్రం మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకన్న ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ కార్యక్రమం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని రైతు వేదికలో జరగనుందని తెలిపారు. రైతులకు నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ సాగు, ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ విస్తరణ, వ్యవసాయ యాంత్రీకరణ వంటి తదితర అంశాలపై రైతులకు శాస్త్రీయ పద్ధతిలో అవగాహన కల్పించబడుతుందనీ ఆయన తెలిపారు. అలాగే బ్యాంకు రుణాలు, సబ్సిడీలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, పశుసంవర్ధక, మత్స్య, నీటిపారుదల శాఖల పథకాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు.
ఆరు రోజుల పాటు జరిగే కార్యక్రమాలు:
సోమవారం నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రాధాన్యంపై కార్యక్రమాలు, బుధవారం బ్యాంకుల ద్వారా రుణాలు, సబ్సిడీలు, ఎఫ్పీవోలు మరియు రైతు ఉత్పత్తిదారుల సంస్థలపై అవగాహన, గురువారం వ్యవసాయ యాంత్రీకరణ, సోలార్ పంప్ సెట్లు, డ్రోన్ల వినియోగంపై ప్రదర్శనలు, శుక్రవారం పశుసంవర్ధక, మత్స్య, నీటిపారుదల శాఖల ద్వారా సమగ్ర అవగాహన కార్యక్రమాలు, శనివారం
నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి వినియోగం, కాలువల నిర్వహణపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యవసాయ శాఖ అందించే సలహాలు, సూచనలు అందిపుచ్చుకొని మెరుగైన దిగుబడులను సాదించే విధంగా ఉండాలని అధికారి తెలిపారు.
