సింగరేణి అభివృద్ధికి సమిష్టి కృషి అవసరం

సింగరేణి అభివృద్ధికి సమిష్టి కృషి అవసరం
-ఉత్పాదకత పెంపుపై ఉద్యోగులకు పిలుపునిచ్చిన అధికారులు
భూపాలపల్లి రూరల్ , ఆంధ్రప్రభ: భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో కేటీకే-ఓసీ-2 ఉపరితల గనిలో సోమవారం మల్టీ డిపార్ట్‌మెంటల్ సమావేశం నిర్వహించారు. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 18వ తేదీ నుంచి వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఏరియా ఎస్‌వో టు జీఎం ఎస్. కవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ దేశ పారిశ్రామిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. సంస్థ మరింత పురోగతి సాధించాలంటే ప్రతి ఉద్యోగి తన విధులను నిబద్ధతతో నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. సమిష్టి కృషి, క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావం సంస్థ విజయానికి మూలస్తంభాలని పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధి ప్రతి ఉద్యోగి వ్యక్తిగత అభివృద్ధితో ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు.
ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత పెంపు దిశగా సమష్టి కృషి అవసరమని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సింగరేణిని జాతీయ స్థాయిలో మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వినియోగదారులు సంస్థపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. సంస్థ ప్రతిష్టను కాపాడుతూ నాణ్యమైన ఉత్పత్తి అందించేందుకు కృషి చేయాలని సూచించారు.
అలాగే ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. .అనంతరం ఉద్యోగుల నుంచి సంస్థ అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనలు స్వీకరించారు. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏజీఎం (ఐఈడీఐ) జ్యోతి, కేటీకే-ఓసీ-2 పీఓ శ్యాంసుందర్, డీజీఎం (ఎఫ్&ఏ) రాజేశ్వర్, డీజీఎం (క్వాలిటీ) కృష్ణప్రసాద్, డీజీఎం వర్క్‌షాప్ రాజారావు, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్, ఓసీ-2 మేనేజర్ రమాకాంత్, ఐఎన్‌టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బి. మధుకర్ రెడ్డి, సీఏమోఏ అధ్యక్షుడు నజీర్, పర్సనల్ ఆఫీసర్ సదన్, వివిధ యూనియన్ల నాయకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
