విజేతలకు గ్రామాభిమాన సత్కారం

విజేతలకు గ్రామాభిమాన సత్కారం

పట్టుదలకి ప్రతిఫలం విద్యార్థులకు ఘన సన్మానం
మహాద్వార్ గ్రామ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి

మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ మండలంలోని మహాద్వార్ గ్రామంలో విద్యా ప్రాధాన్యతను ప్రతిబింబించే విధంగా గ్రామ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ , ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరుస్తూ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఘనంగా అభినందన సన్మాన సభ నిర్వహించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో విజయాన్ని సాధించిన సుమారు 50 మంది విద్యార్థులను సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి శాలువాలతో సత్కరించి, ప్రోత్సాహకంగా రామకృష్ణ మఠం వారు ప్రచురించిన మేలుకో నేస్తమా అనే పుస్తకాన్ని బహుకరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రతి విద్యార్థిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఎస్ఎస్సి ఇంటర్లో ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థిని సర్పంచిగా సత్కరించడం జరిగిందన్నారు. ర్యాంకులతో ప్రమేయం లేకుండా ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థిని ప్రోత్సహించడం లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తమ వంతుగా సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

భవిష్యత్తులో విద్యార్థులంతా చక్కగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సర్పంచ్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు .ఎలాంటి సహకారం అవసరమైన తాను ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహకరిస్తానని చెప్పారు. ఉపాధ్యాయుడు శివశంకర్ మాట్లాడుతూ విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్ కెరీర్‌పై సమగ్ర మార్గదర్శకత్వం చేశారు .ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న వివిధ కోర్సులపై అవగాహన కల్పిస్తూ, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి అవసరమైన నైతిక విలువలు, మంచి అలవాట్లు, సానుకూల దృక్పథం, మంచి స్నేహితుల ప్రాధాన్యతను వివరించారు.

లక్ష్య సాధనకు ఆత్మవిశ్వాసం ముఖ్యమని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా కవి కాళోజీ నారాయణరావు గారి పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంత దేశానిదే అనే స్ఫూర్తిదాయకమైన మాటలను గుర్తు చేస్తూ, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. గ్రామ పెద్దలు మాజీ ఎంపిటిసి సభ్యులు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షిస్తూ, ఉన్నత విద్య కోసం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

అంబేద్కర్ సంఘం నాయకులు, లతారాజా ఫౌండేషన్ వారు డా. అంబేద్కర్ ఎవరు? ఆయన ఏం చేశారు? భారత భాగ్య విధాత బాబాసాహెబ్ జీవితం – కార్యాచరణ అనే పుస్తకాన్ని విద్యార్థులకు బహుమతిగా అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ రిటైర్డ్ హెచ్ఎం జగదీష్ కుమార్, జంగం బసవరాజ్, పాఠశాల హెచ్ఎం వెంకట్రాములు, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ఉప సర్పంచ్ శివాని,డాక్టర్ ఆశప్ప, బాట నరసింహ, గణపురం నగేష్, కురువ మల్లేష్, బాట జయమ్మ, గుడిసె తిమ్మయ్య, గాల్ల రాములు, బిచ్చలి బ్యాంకు నరసింహ, పంచాయతీ కార్యదర్శి నస్లాయి తిమ్మయ్య నస్లాయి, నాగరాజు, ఆర్ఎంపీ రామకృష్ణ, శివపుల్ల లక్ష్మయ్య, వడ్ల భాను ప్రసాద్, బుడబోయి చంద్రప్ప, పోలీస్ లక్ష్మారెడ్డి గుడిసె రాజు, బాట రాజు,బాట బీమాప్ప, జంగం నరసింహులు తదితరులు, గ్రామ యువకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.