నాణ్యమైన విద్య, ఉచిత సమగ్ర వైద్యం లక్ష్యం
నాణ్యమైన విద్య, ఉచిత సమగ్ర వైద్యం లక్ష్యం
- మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత
- విద్యాసంస్థల్లో పౌష్టికాహారం, మౌలిక వసతులు
- రూ.200 కోట్ల వ్యయంతో సింగూర్ లైన్ పనులు
- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి, ఆంధ్రప్రభ: అందరికీ నాణ్యమైన విద్య, ఉచిత సమగ్ర వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ తెలిపారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ఆందోల్ నియోజకవర్గ స్థాయి సమావేశం జోగిపేటలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించగా, మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు ఆరోగ్య సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. జిల్లా స్థాయిలోనే 90 శాతం వైద్య సేవలు అందించేలా ఆధునిక సదుపాయాలను విస్తరిస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో ట్రామా, ఎమర్జెన్సీ సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు.
మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న మంత్రి, మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల పథకాలను అమలు చేసినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం ఇందిరమ్మ క్యాంటీన్లు, సోలార్ యూనిట్లు, పెట్రోల్ బంకులు వంటి వనరులను మహిళలకు కేటాయిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్నామని తెలిపారు.
విద్యారంగ అభివృద్ధిలో భాగంగా ప్రతి పాఠశాల, కళాశాలలో ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పౌష్టికాహారం, మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. అందోల్ ప్రాంతంలో త్వరలో ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
రూ.200 కోట్ల వ్యయంతో సింగూర్ లైన్ పనులు
రూ.200 కోట్ల వ్యయంతో సింగూర్ లైన్ పనులు చేపట్టామని, సింగూర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ జిల్లా విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని తెలిపారు. మహిళలు, విద్యార్థులు, అంగన్వాడీ పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వివరించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్, మహిళల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఆర్.పాండు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

