ముదిరాజ్‌లకు న్యాయమైన వాటా కల్పించాలి

ముదిరాజ్‌లకు న్యాయమైన వాటా కల్పించాలి

  • మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం పట్టణ కేంద్రంలో మెపా (ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) మండల ప్రధాన కార్యదర్శి కుండ సురేష్ ముదిరాజ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో ముదిరాజ్‌లు అధికంగా ఉన్నప్పటికీ జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రావాల్సిన వాటా వారికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్‌లను బీసీ-డి నుంచి బీసీ-ఏకు మారుస్తామని ఇచ్చిన హామీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రానున్న కాలంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ముదిరాజ్ రిజర్వేషన్ల కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. త్వరలో జిల్లాలో మెపా మండల కమిటీలను ఏర్పాటు చేసి, అందులో ముదిరాజ్ యువతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుండ సురేష్ ముదిరాజ్, శాగంటి శ్రీనివాస్, సిరికొండ శ్రీకాంత్, కొండ పాపారావు, సిరికొండ అనిల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.