బీపీ మండల్ విగ్రహానికి స్థలం కేటాయించాలని బీసీ జేఏసీ వినతి
చెన్నూర్, ఆంధ్రప్రభ : పట్టణంలో బి.పి. మండల్ విగ్రహం ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని కోరుతూ బీసీ జేఏసీ చైర్మన్ సిద్ది రమేష్ యాదవ్ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో సామాజిక న్యాయం స్థాపనకు బి.పి. మండల్ చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల హక్కుల సాధనలో ఆయన పాత్ర చారిత్రాత్మకమని తెలిపారు. చెన్నూర్ పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా యువతకు సామాజిక స్పూర్తి కలిగించవచ్చని అభిప్రాయపడ్డారు.
మండల్ కమిషన్ సిఫార్సుల వల్ల బీసీలకు విద్య, ఉపాధి రంగాల్లో విస్తృత అవకాశాలు లభించాయని గుర్తుచేశారు. అలాంటి మహనీయుడి స్మరణార్థం ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే ప్రదేశంలో విగ్రహం ఏర్పాటు చేయడం సమాజానికి మేలు చేస్తుందని అన్నారు. పట్టణంలోని ప్రధాన కూడలి లేదా ప్రజలు సులభంగా చేరుకునే ప్రదేశాన్ని కేటాయించాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ విద్యావంతులు పొలాస సత్యనారాయణ, నాగుల మహేష్, లక్కం తిరుపతి, ఆదివాసీ ఉపాధ్యాయ సంఘం నాయకులు కొలకాని రాములు, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు పర్స శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారు కూడా బి.పి. మండల్ సేవలను గుర్తిస్తూ విగ్రహం ఏర్పాటు అవసరమని ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.
