2Lakh | ఎపి … ఎక్స్ క్లూజీవ్

2Lakh | ఎపి … ఎక్స్ క్లూజీవ్

2Lakh | మొక్కజొన్నరైతు..
విల‌విల
కొనుగోలు కేంద్రాలు లేక అవ‌స్థ‌లు
పల్నాడు జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో పంట‌సాగు
దళారుల ప్రవేశంతో ధ‌ర ఢ‌మాల్
త‌క్కువ ధ‌ర‌కే తెగ‌న‌మ్ముతున్న రైతాంగం
క్వింటాల్‌కు రూ. 700 నుంచి రూ. 800 వరకు న‌ష్టం
పెట్టుబ‌డి కూడా రాని దైన్యం

2Lakh | ప‌ల్నాడుబ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ‌ : వ‌సాయ జూదంలో ప్ర‌తి ఏటా రైతు ఓడిపోతూ విల‌విలలాడుతున్నాడు. గ‌తంలో పొగాకు పంట వేసి న‌ష్ట‌పోయిన రైతులు దీనికి ప్ర‌త్యామ్న‌యంగా పల్నాడు జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించారు. వరి వేసుకోవద్దు, ఇతర పంటలకు మళ్లాలని అధికారుల సూచ‌న‌ల‌తో రైతులు మొక్కజొన్న పండించారు. కానీ పంట చేతికి వ‌చ్చే స‌రికి పెట్టిన పెట్టుబ‌డి కూడా రాని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ లోగా ద‌ళారీలు రంగ ప్ర‌వేశం చేసి రైతుల క‌ష్టాన్ని దోచుకుంటున్నారు. నీటి లభ్యత, భూసార పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వరి కంటే ఇతర వాణిజ్య పంటలు లాభదాయకమని వ్యవసాయ అధికారులు ప్రచారం చేశారు. దీనిని నమ్మిన రైతులు భారీ పెట్టుబడులతో మొక్కజొన్న సాగును చేపట్టారు. జిల్లాలోని ప్రధాన మండలాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల్లో ఈ పంట విస్తరించింది.

2Lakh | రైతుకు భారంగా మారిన పెట్టుబడి

మొక్కజొన్న సాగుకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరాకు సుమారు రూ. 30 వేల నుండి రూ. 40 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా యూరియా కొరత వల్ల రైతులు రూ.270 ఖరీదు గల యూరియా బస్తా రూ.600 నుంచి రూ.650 చొప్పున కొనుగోలు చేశారు. ఇందులో 80 శాతం మంది కౌలు రైతులే కావడం గమనార్హం. పంట చేతికి వచ్చే సమయానికి అప్పుల వడ్డీలు భారంగా మారాయి. ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ. 2,400 మద్దతు ధర ప్రకటించినా, కేంద్రాలు లేకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దళారులు రైతుల అత్యవసరాన్ని ఆసరాగా చేసుకుని క్వింటాల్‌కు రూ. 1,600 నుంచి రూ. 1,700 మాత్రమే చెల్లిస్తున్నారు. దీనివల్ల క్వింటాల్‌కు రూ. 700 నుంచి రూ. 800 వరకు రైతు నష్టపోతున్నాడు.

2Lakh | పంట నాణ్య‌త‌పై కొర్రీలు

అకాల వర్షాలు , తేమ శాతం పెరగడం వల్ల కోసిన పంట కళ్లాల్లోనే తడిసి ముద్దవుతోంది. తేమ నెపంతో దళారులు ధరను ఇంకా తగ్గిస్తున్నారు. పల్నాడు జిల్లాలో సరైన ఆరబోత సౌకర్యాలు లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. ఏడాది అంతా కష్టపడి, ఎండనక వాననక రైతు పొలంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పోవ‌డం, ద‌ళారీలు వివిధ కార‌ణాలు సాకుగా చెప్పి పంట ధ‌ర‌ను త‌గ్గించ‌టంతో రైతులు కుదేలౌతున్నారు. పంట పండించిన రైతు, చివరకు తన శ్రమకు సరైన ప్రతిఫలం పొందకపోవడం దురదృష్టకరం. వ్యవసాయం జూదంలా మారిన ఈ పరిస్థితిలో, రైతుకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యతగా మారింది. లేకపోతే, రైతు భవిష్యత్తు మరింత చీకటిలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

2Lakh | కొనుగోలు కేంద్రాల జాడేది ?

మొక్కజొన్న కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌ ముందుకు రావడం లేదు. కేంద్రానికి లేఖ రాసి మమ అనిపించడం మినహా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని రైతు సంఘ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతుల్లో గుబులు మొదలైంది. దక్కిన పంట వర్షాలకు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా దళారులు రంగ ప్రవేశం చేసి, తక్కువ ధరకు దోచుకుంటున్నారు. దీంతో, రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే నష్ట తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం నుంచి కొనుగోలు భరోసా లేకపోవడం, మరోవైపు పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చేందుకు గడువు ముగియడంతో వ్యాపారుల వలలో అనివార్యంగా చిక్కుకోవాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇటీవల అపరాల విషయంలోనూ సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు అధిక మొత్తంలో నష్టపోయారు. మొక్కజొన్న విషయంలోనూ అదే జరిగితే రైతులు ఆర్థికంగా కుదేలయ్యే ప్రమాదం లేకపోలేదు.

CLICK HERE TO READ

CLICK HERE TO READ MORE Labor hubs in 15cities | ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలనే అడుగుతా

Leave a Reply