న్యూ ఢిల్లీ – నాలుగు రోజుల పర్యటనకు కుబుంబంతో సహా నేటి ఉదయం ఢిల్లీకి వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ముందుగా డిల్లీలోని ప్రముఖ క్షేత్రం అక్షరధామ్ అలయాన్ని సందర్శించుకున్నారు. భార్య ఉష, తన ముగ్గురు సంతానంతో ఆయన ఆక్షర్ ధామ్ లో పర్యటించారు.. అక్కడి విశేషాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం ఆయన ఢిల్లీలో చేనేత ఉత్పత్తుల దుకాణాలను సందర్శించారు. ఇక నేటి సాయంత్రం ప్రధాని మోడీతో ఆయన భేటీ కానున్నారు. వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలపై వీరు చర్చలు జరపనున్నారు.
జైపూర్, ఆగ్రాలో పర్యటన
ఈ పర్యటనలో వాన్స్ తన కుటుంబంతో కలిసి జైపూర్, ఆగ్రాలను సందర్శిస్తారు. మంగళవారం జైపూర్‌లోని ప్రసిద్ధ అమెర్ ప్యాలెస్‌ను, బుధవారం ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. అలాగే, జైపూర్‌లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో మంగళవారం జరిగే యూఎస్-ఇండియా బిజినెస్ సమ్మిట్‌లో జేడీ వాన్స్ కీలక ప్రసంగం చేస్తారు. ఈ సదస్సులో ఇరు దేశాల ఉన్నతాధికారులు పాల్గొంటారు. వాన్స్ తన ప్రసంగంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. ఏప్రిల్ 22న రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, గవర్నర్ హరిభావు బగాడేలతో కూడా ఆయన సమావేశం కానున్నారు. తన నాలుగు రోజుల పర్యటన ముగించుకుని గురువారం వాన్స్ వాషింగ్టన్‌కు తిరుగు పయనమవుతారు.