ఆయిల్ ఫామ్ సాగుతో రైతుకు భద్రత

ఆయిల్ ఫామ్ సాగుతో రైతుకు భద్రత
–ధైర్యంగా పంట సాగు చేసి లాభాలు పొందాలి
–రైతులను మోసగించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
–రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
తొర్రూరు, ఆంధ్రప్రభ: ఆయిల్ ఫామ్ పంట సాగుతో రైతులకు ఆర్థిక భద్రత లభిస్తుందని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. తొర్రూరు మండలం హరిపిరాల శివారులోని పామాయిల్ నర్సరీలో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఫామ్ ఆయిల్ సాగుపై ఆయిల్ ఫీడ్ జిల్లా ఇన్చార్జి సిహెచ్ దయాకర్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి తో కలిసి జంగా రాఘవరెడ్డి మాట్లాడారు.పంట మార్పిడిలో భాగంగా ఆయిల్ ఫామ్ సాగు చేసి రైతులు అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఆయిల్ పామ్ టన్ను రూ.12వేలు ఉండేదని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి టన్ను ధర రూ.23 వేలకు పైగా పెంచామని చెప్పారు. రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ పంట వేయాలని సూచించారు. ఈ పంటకు నీటి సమస్య, మార్కెట్ సమస్య లేదన్నారు. అన్ని విధాలా రైతులకు లాభాలు ఇచ్చే పంట ఆయిల్ పామ్ అని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2.72 లక్షల ఎకరాల్లో 73,696 మంది రైతులు ఆయిల్ ఫామ్ సాగుచేస్తున్నారు. రానున్న మూడేళ్లలో విస్తీర్ణం 10 లక్షల ఎకరాలకు చేరాలన్నారు. కంపెనీలు నర్సరీల ద్వారా నాణ్యమైన మొక్కలను రైతులకు అందిస్తున్నాయని తెలిపారు. ఎకరా ఆయిల్పామ్ సాగుకు రూ.50 వేల వరకు మొక్కలు, డ్రిప్పు, పాండ్ నిర్వహణకు వివిధ రకాలుగా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందన్నారు. మూడేళ్లపాటు ఆయిల్పామ్ సాగు చేస్తే.. నాలుగో ఏడాది నుంచి ఆదాయం వస్తుందన్నారు. రైతులందరూ ఆయిల్పామ్ సాగుపై మరింత దృష్టి సారించాలన్నారు. రైతుల సందేహాల నివృత్తి కోసం.. ఆయిల్ ఫెడ్ పరిధిలో సలహా కేంద్రాలు సైతం ఏర్పాటు చేశామని తెలిపారు.
టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ…. పామ్ ఆయిల్ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని, రైతులు లాభసాటి పంటలు వేసి ఆదాయం పొందాలని సూచించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తొర్రూర్ లో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ ఎండి యాస్మిన్ పాషా, ఓపిడి ప్రవీణ్ రెడ్డి, శాస్త్రవేత్తలు సుహాసిని, అధికారులు మరియాన, ఏఎంసీ చైర్మన్ లు తిరుపతిరెడ్డి, లావుడియా మంజుల భాస్కర్, తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ శ్రావణ్ కుమార్, హరిపురాల సర్పంచ్ స్వాతి రాజు, దుబ్బ తండ సర్పంచ్ విజయ లుంబ, వివిధ గ్రామ సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
