ఘనంగా ‘జీఎన్ఆర్ స్కూల్స్ డిస్కవరీ ఫెస్ట్’ సైన్స్ ఫేర్

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; అచ్చంపేట పట్టణంలోని అంగిరేకుల శేఖరయ్య ఫంక్షన్ హాల్‌లో జిఎన్ఆర్ ఆదిత్య స్కూల్ మరియు గీతాంజలి హైస్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జిఎన్ఆర్ డిస్కవరీ ఫెస్ట్’ సైన్స్ ఫేర్ అత్యంత ఉత్సాహభరితంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అచ్చంపేట మండల విద్యాధికారి జీవన్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు పుస్తక జ్ఞానంతోనే పరిమితం కాకుండా, ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉందని, సరైన ప్రోత్సాహం లభిస్తే వారు భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని అన్నారు.

ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన రోబోటిక్స్, సోలార్ ఎనర్జీ మోడల్స్, పర్యావరణ పరిరక్షణ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుమారు 250కు పైగా ప్రయోగాత్మక నమూనాలను విద్యార్థులు స్పష్టంగా వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డా. వై. హలరాజు మాట్లాడుతూ, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా తమ విద్యాసంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయని తెలిపారు.

ఈ సైన్స్ ఫేర్‌ను తిలకించేందుకు అచ్చంపేటతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు హాజరయ్యారు. ‘జిఎన్ఆర్ డిస్కవరీ ఫెస్ట్’ విజయవంతం కావడంపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల చైర్మన్ గంగాపురం రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అంతటి రజిత మల్లేష్, రాజకీయ నాయకులు మంగ్య నాయక్, పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Leave a Reply