Telangana | రద్దీని ఆసరాగా చేసుకున్న దొంగలు

Telangana | రద్దీని ఆసరాగా చేసుకున్న దొంగలు
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పెట్రోల్ పోయించుకునేందుకు బంక్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బంక్‌లో రద్దీ ఎక్కువగా ఉండటంతో బైక్‌ను బయట పార్క్ చేసి లోపలికి వెళ్లిన యువకుడు తిరిగి వచ్చేసరికి తన వాహనం కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా కృత్రిమ కొరత కారణంగా పలుచోట్ల పెట్రోల్ బంక్‌ల ముందు ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో ఎక్కడ ఇంధనం అందుబాటులో ఉందో అక్కడ వాహనదారులు భారీగా క్యూ కడుతున్నారు.
ఈ క్రమంలోనే కురవికి చెందిన మీ సేవ కేంద్ర నిర్వాహకుడు అమర్‌నాథ్ పెట్రోల్ కోసం తన బైక్‌పై బంక్‌కు వెళ్లాడు. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండటంతో బండిని బయటే పార్క్ చేసి, లోపల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లాడు.
సుమారు 10నిమిషాల తర్వాత బయటకు వచ్చి చూసేసరికి బైక్ కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన అమర్‌నాథ్ చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
