రాష్ట్రవ్యాప్తంగా సమ్మర్ కోచింగ్ క్యాంపులు

రాష్ట్రవ్యాప్తంగా సమ్మర్ కోచింగ్ క్యాంపులు
-క్రీడలకు సరికొత్త అవకాశాలు
- 423 మండలాల్లో 1389 క్యాంపులు
- గ్రామీణ స్థాయికి క్రీడల విస్తరణ
- 8–16 ఏళ్ల పిల్లలపై ప్రత్యేక దృష్టి
- ఆరోగ్యకర జీవనశైలికి ప్రోత్సాహం
- పారదర్శక నిధుల వినియోగం, కఠిన పర్యవేక్షణ శాప్ చైర్మన్ రవి నాయుడు
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్: బ్యూరో రాష్ట్రవ్యాప్తంగా యువతను క్రీడల వైపు మళ్లించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) సమగ్ర ప్రణాళికతో 2026 సమ్మర్ కోచింగ్ క్యాంపులను ప్రారంభిస్తోంది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా క్యాంపులను నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. విజయవాడలోని షాపుకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 423 మండలాల్లోని 1020 వేదికలలో 55 క్రీడా విభాగాల్లో మొత్తం 1389 కోచింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రాధాన్యత పెంచే దిశగా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. 8 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఈ క్యాంపులను రూపొందించినట్లు తెలిపారు. క్రమబద్ధమైన శిక్షణ ద్వారా పిల్లల్లో క్రీడలపై ఆసక్తి పెంపొందించడమే కాకుండా, ఆరోగ్యకర జీవనశైలిని అలవరుచుకునేలా ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
క్యాంపుల నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడించారు. క్రీడా సామగ్రి కొనుగోలు, నిర్వహణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలకు అవసరమైన నిధులు సమకూర్చి, ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా వినియోగించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అమలు కానుందని స్పష్టం చేశారు.
డిజిటల్ పరికరాల ప్రభావంతో యువత క్రీడలకు దూరమవుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ స్థాయిలో ప్రత్యేక క్రీడా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. స్థానిక స్పోర్ట్స్ అసోసియేషన్లు, మీడియా, వ్యాపార సంస్థలు, స్పాన్సర్లు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. టిఫిన్, తాగునీరు వంటి సదుపాయాల కల్పనలో స్థానిక సహకారాన్ని ఆహ్వానించారు. శాప్ వీసీ, ఎండీ ఎస్. భరణి మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు క్రీడా యాప్‌లో నమోదు తప్పనిసరి అన్నారు.హాజరు, శిక్షణ, పురోగతిపై డీఎస్డీవోలు నిరంతరం పర్యవేక్షణ చేపడతారని వెల్లడించారు.
