అక్రిడేషన్ జాబితా వివాదం- “నాకు న్యాయం చేయండి”

అక్రిడేషన్ జాబితా వివాదం- “నాకు న్యాయం చేయండి”

  • అదనపు కలెక్టర్‌ను ఆశ్రయించిన జర్నలిస్టు గంగవరం రామకృష్ణారెడ్డి
  • ఆంధ్రప్రభలో పని చేస్తున్నారా పరిశీలిస్తాం – అదనపు కలెక్టర్

వనపర్తి టౌన్ , ఆంధ్ర ప్రభ: వనపర్తి జిల్లా సమీకృత కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ సురభి గైర్హాజరు కావడంతో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు గంగవరం రామకృష్ణారెడ్డి తన అక్రిడేషన్ కార్డు అంశంపై వినతిపత్రం సమర్పించారు.

తొలి విడత అక్రిడేషన్ జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, డిపిఆర్ఓ ద్వారా కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలని కోరారు. తాను అర్హుడు కాదని భావిస్తే అధికారిక ఎండార్స్మెంట్ ఇవ్వాలని, లేకపోతే పునఃపరిశీలించి మొదటి విడతలోనే అక్రిడేషన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ అంశంపై స్పందించిన అదనపు కలెక్టర్ భీమయ్య నాయక్, “మీరు ఆంధ్రప్రభ వంటి ప్రముఖ పత్రికలో పనిచేస్తున్నారు. ఈ పరిస్థితి ఎలా ఏర్పడిందో పరిశీలిస్తాము. తగిన న్యాయం చేస్తాం” అని హామీ ఇచ్చారు. అంతకుముందు రామకృష్ణారెడ్డి డిపిఆర్ఓను కలిసి, అక్రిడేషన్ కమిటీ తొలి జాబితాలో తన పేరు ఉందా లేదా అన్న విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనై, “నేను నిజంగా ఆంధ్రప్రభలో పనిచేయకపోతే లేదా నిత్యం వార్తలు రాయకపోతే స్వచ్ఛందంగా అక్రిడేషన్ వదులుకుంటాను” అని తెలిపారు.

గత 12 సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో పనిచేస్తూ విద్య, వైద్య రంగాలు, సమాజంలోని సమకాలీన సమస్యలపై ప్రజలకు ఉపయోగపడే కథనాలు రాస్తున్నానని, ప్రభుత్వానికి–ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నానని వివరించారు. “విద్య కొడుకు తూట్లు”, “మన ఊరు–మనబడి: ఆలోచన గొప్పది, ఆచరణ నెమ్మది” వంటి వార్తలను తానే రాసినట్లు డీపీఆర్ఓకు గుర్తు చేశారు.

కావాలనే తప్పుడు సమాచారంతో తన పేరును తొలిదశ జాబితా నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన, న్యాయం జరగాలని కోరారు. సరైన నిర్ణయం రాకపోతే తగిన స్థాయిలో పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

Leave a Reply