ఏడాది గడిచినా అందని సొమ్ము
ఏడాది గడిచినా అందని సొమ్ము
- ఎస్‌బీఐ ముందు బాధితుల ధర్నా
చెన్నూరు, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్‌బీఐ (SBI-2) శాఖలో గత ఏడాది జరిగిన నగదు, బంగారు ఆభరణాల గోల్‌మాల్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. తమ దాచుకున్న సొమ్ము కోసం బాధితులు సోమవారం బ్యాంక్ ముందు ఆందోళన చేపట్టారు.
గత సంవత్సరంలో బ్యాంక్ మేనేజర్ , ఇతర సిబ్బంది సహకారంతో ఖాతాదారులకు చెందిన భారీ మొత్తంలో నగదు, బంగారం గోల్‌మాల్ జరిగిన విషయం విదితమే. ఈ ఘటనపై పోలీసు యంత్రాంగం సత్వరమే స్పందించి నిందితులను పట్టుకోవడమే కాకుండా, వారి నుంచి సొమ్మును రికవరీ చేసి కోర్టుకు అందజేశారు. అయితే, స్కామ్ జరిగి ఏడాది గడుస్తున్నా.. రికవరీ అయిన సొమ్ము మాత్రం తమకు చేరలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంక్ ముందు ధర్నా నిర్వహించిన బాధితులు మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. బ్యాంకుకు వచ్చి అడిగిన ప్రతిసారీ అధికారులు ఏదో ఒక సాకు చెబుతూ మభ్యపెడుతున్నారే తప్ప, తమ సొమ్మును తిరిగి ఇప్పించేందుకు చొరవ చూపడం లేదని మండిపడ్డారు. తమ కష్టార్జితం తమకు అందే వరకు పోరాటం ఆపమని బాధితులు స్పష్టం చేశారు. ఈ ఆందోళనతో బ్యాంక్ పరిసరాల్లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
