ఘనంగా బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ వేడుకలు
ఘనంగా బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ వేడుకలు
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కమ్మర్‌పల్లి మండలవ్యాప్తంగా పార్టీ శ్రేణులు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించాయి. పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ ఏట అడుగుపెడుతున్న శుభసందర్భంగా గ్రామగ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడాయి.
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు రేగుంట దేవేందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ తన 26 ఏళ్ల ప్రస్థానంలో 13 ఏళ్లు ఉద్యమ పార్టీగా, ఆపై 10 ఏళ్లు పాలక పార్టీగా ఎన్నో చారిత్రక ఘట్టాలకు, అభివృద్ధి నమూనాలకు వేదికగా నిలిచిందని కొనియాడారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు క్షేత్రస్థాయిలో నిలదీస్తామని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని విమర్శించారు. భవిష్యత్తు మళ్ళీ బిఆర్ఎస్ పార్టీదేనని, కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కొంటికంటి నరేందర్, ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్, మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, మాజీ ఎంపిటిసి మైలారాం సుధాకర్, మల్యాల సుభాష్ గౌడ్, మైనార్టీ మండల అధ్యక్షులు హైమద్ పాల్గొన్నారు. వీరితో పాటు సీనియర్ నాయకులు బద్దం రాజేశ్వర్, రేంజర్ల మహేందర్, తీగల హరీష్, కొత్తపల్లి రఘు, తంబల రాకేష్, పత్రి శ్రావణ్, కోరే నర్సయ్య, సుంకరి మురళి తదితరులు పాల్గొన్నారు.
