రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎంపీ డీకే అరుణ

రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎంపీ డీకే అరుణ

గద్వాల, ఆంధ్రప్రభ: జోగులాంబ గద్వాల జిల్లా రైల్వే స్టేషన్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం అభివృద్ధి పనులను ఎంపీ డీకే అరుణ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుమారు 13 కోట్ల రూపాయల వ్యయంతో సాగుతున్న ఈ పనుల పురోగతిపై ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తూనే, మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. సామాన్యుడు ఎక్కువగా ఆశ్రయించే రైల్వే ప్రయాణాన్ని అత్యంత సౌకర్యవంతంగా మార్చాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని పేర్కొన్నారు. విమానాశ్రయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

వచ్చే మే 10వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నారని, ఆ లోపు పనులు పూర్తయితే ప్రధాని చేతుల మీదుగానే స్టేషన్ ప్రారంభోత్సవం జరిగేలా ప్రయత్నిస్తున్నామని డీకే అరుణ తెలిపారు. పెండింగ్ పనులపై కాంట్రాక్టర్లు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల వైపు నుంచి కూడా ప్రయాణికులు స్టేషన్‌లోకి వచ్చేలా కొత్త బుకింగ్ కౌంటర్ మరియు ప్రవేశ మార్గాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట్రాములు, కౌన్సిలర్లు త్యాగరాజు, శాలన్న, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, రైల్వే స్టేషన్ మాస్టర్ విజయ్, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు శంకర్ మరియు బిజెపి శ్రేణులు పాల్గొన్నారు. గద్వాలతో పాటు మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, అలంపూర్ రైల్వే స్టేషన్లలో కూడా ఇటువంటి అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని ఎంపీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Leave a Reply