కుంగిన పిల్లర్లపై ముమ్మర పరిశోధనలు

కుంగిన పిల్లర్లపై ముమ్మర పరిశోధనలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: కాళేశ్వరం పునరుద్ధరణ కోసం శాస్త్రీయ పరీక్షలు వేగం పుంజుకున్నాయి. మేడిగడ్డలోని రెండు పిల్లర్ల కుంగుబాటుకు కారణమైన అంశాలపై నిపుణులు పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. మేలోగా బ్యారేజీ పునరుద్ధరణకు అవసరమైన డిజైన్లను సిద్ధం చేసే పనిలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తలమునకలైంది.

సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో కరువు పరిస్థితులు తలెత్తే అవకాశముండటంతో, కాళేశ్వరాన్ని ఎలాగైనా సిద్ధం చేయాలని ఇప్పటికే నిపుణులు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. బోర్ తవ్వకాల ద్వారా కీలక సమాచారం లభించే అవకాశముండటంతో, రోటర్ టైప్ డ్రిల్లింగ్ విధానంతో ముమ్మరంగా తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తరహా యంత్రాలు దేశవ్యాప్తంగా పరిమితంగా ఉండటంతో, వాటిని సమకూర్చేందుకు ఎన్డీఎస్ఏ కృషి చేస్తోంది.

కుదుపు లేకుండా డ్రిల్లింగ్‌కు ఆధునిక యంత్రాలు
మేడిగడ్డ బ్యారేజీలో 2023 అక్టోబరులో ఏడో బ్లాకులోని రెండు పిల్లర్లు కుంగినప్పటి నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో సంవత్సరానికి సుమారు 500 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. రాబోయే కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని శాస్త్రవేత్తలు సూచించారు.

ఇప్పటికే కుంగిన ప్రాంతాల పునాదుల్లోకి ఇసుక, నీటి ప్రవాహం చేరింది. ప్రస్తుతం ర్యాఫ్ట్ వద్ద బోర్ డ్రిల్లింగ్ పనులు చేపడుతున్నారు. ఈ తవ్వకాల సమయంలో కుదుపు లేకుండా ఉండేందుకు రోటర్ టైప్ ఆధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద ఒకేసారి పనులు చేపట్టాలంటే 100కు పైగా డ్రిల్లింగ్ యంత్రాలు అవసరమని ఎన్డీఎస్ఏ సూచించింది. ఈ మేరకు సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగుతున్నాయి.

పరీక్షల తర్వాతే డిజైన్లు
మేడిగడ్డలో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ స్కానింగ్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టెస్టులు, డ్రోన్ సర్వేలు చేపట్టాల్సి ఉంది. మే తర్వాత వర్షాలు కురిసే అవకాశముండటంతో పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. ఈ పరీక్షల అనంతరం మేడిగడ్డ పునరుద్ధరణకు అవసరమైన చర్యలపై స్పష్టత రానుందని అధికారులు తెలిపారు. పరీక్షల ఆధారంగా డిజైన్లను కన్సల్టెంట్ సంస్థ రూపొందించనుంది. ఈ పనులకు ఐఐటీ ముంబయి నిపుణులు సహకరించనున్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల మేరకు నీటిపారుదల శాఖ బ్యారేజీల పునరుద్ధరణ చర్యలను జాగ్రత్తగా చేపడుతోంది. పరిశోధనలకు అవసరమైన యంత్రాలను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు.

Leave a Reply