మక్క రైతుల కష్టాలు.. కల్లాల్లోనే పడిగాపులు

మక్క రైతుల కష్టాలు.. కల్లాల్లోనే పడిగాపులు
-లారీల కొరత.. నిలిచిన తూకం
-అకాల వర్షం భయం
ఏర్గట్ల,ఆంధ్రప్రభ: ఏర్గట్ల మండలంలోని మొక్కజొన్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చినా, దానిని అమ్ముకోవడానికి అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లారీల కొరత.. నిలిచిన తూకం
మండలంలోని వివిధ గ్రామాల నుండి రైతులు తమ మొక్కజొన్నను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే, తూకం వేసిన బస్తాలను గోడౌన్లకు తరలించడానికి తగినన్ని లారీలు రాకపోవడంతో నిల్వలు పేరుకుపోతున్నాయి. దీనివల్ల కొత్తగా వచ్చే ధాన్యానికి చోటు దొరకక, తూకం వేయడంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా రైతులు పంట వద్దే రాత్రింబవళ్లు కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అకాల వర్షం భయం.. తడిస్తే అంతే సంగతులు
గత కొన్ని రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉండటంతో రైతుల్లో వణుకు మొదలైంది. అకాల వర్షం కురిస్తే ఆరబోసిన మొక్కజొన్న తడిసి ముద్దవుతుందని, అప్పుడు తేమ శాతం నెపంతో ప్రభుత్వం కొనుగోలు చేయదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు ఎండలు, ఇటు వర్షం భయంతో రైతులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
అదును చూసి అమ్ముకుంటున్న దళారులు
ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, కేంద్రాల్లో ఆలస్యం రైతులకు శాపంగా మారింది. వర్షానికి పంట తడిస్తే అసలుకే మోసం వస్తుందనే భయంతో, కొందరు రైతులు గత్యంతరం లేక కళ్లాల వద్దకే వచ్చే ప్రైవేట్ వ్యాపారులకు రూ. 1,800 – 1,900 కే తెగనమ్ముకుంటున్నారు. దీనివల్ల క్వింటాల్‌కు రూ. 500 వరకు నష్టపోవాల్సి వస్తోంది.ఎంతో కష్టపడి పంట పండించాం. తీరా అమ్ముకుందామంటే యుద్ధం చేయాల్సి వస్తోందని తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఏర్గట్ల మండలంలోని కేంద్రాల్లో తూకాలను వేగవంతం చేయాలని లారీల సంఖ్యను పెంచి వెంటనే ధాన్యాన్ని తరలించి మమ్మల్ని ఆదుకోవాలి అని కోరుతున్నారు.
రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తా- వ్యవసాయ అధికారి వైష్ణవ్
కొనుగోలు కేంద్రాల్లో నిలిచిపోయిన ధాన్యం తరలింపు కోసం లారీల కొరత ఉన్న మాట వాస్తవమేనని, ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. త్వరలోనే తగినన్ని లారీలు వస్తాయని, తూకం ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని అన్నారు.
