దేవన్‌పల్లి యువకవికి అరుదైన గౌరవం

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతి (పాలకురికి సోమన మూల) ప్రాంగణంలో ఇటీవల నిర్వహించిన ‘తెలంగాణ ప్రజాకళా’ వేదిక రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం, సత్కార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మట్టి చేతనను, ప్రజా అస్తిత్వాన్ని చాటి చెప్పేలా సాగిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం దేవన్‌పల్లి గ్రామానికి చెందిన ప్రముఖ యువకవి, సమద్ కుమారుడు సుమేర్‌ను రాష్ట్ర స్థాయిలో ఘనంగా సత్కరించారు.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి (ఐఏఎస్), అడిషనల్ డైరెక్టర్ నరసింహులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డా. విజయ్‌కుమార్ పెద్దపల్లి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కవి సుమేర్‌ను శాలువాతో సత్కరించి, ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేశారు.

మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు నిర్బంధించబడిన నిజామాబాద్ జైలు మట్టి నుంచే ఉద్భవించిన కవి సుమేర్, దాశరథి అమరవాక్యం “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అనే స్ఫూర్తిదాయక నినాదంతో తన కవితా గానాన్ని ప్రారంభించారు. ఆయన గంభీర స్వరం సభలో సరికొత్త ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నింపింది.

సుమేర్ చదివిన ‘ధూళి చైతన్యం’ అనే కవితా వస్తువు మట్టి మనుషుల శ్రమను, చైతన్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ కవిత సభలోని ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించి విశేష ప్రశంసలు అందుకుంది.

ఈ కార్యక్రమంలో శాఖ సలహాదారులు, సీనియర్ జర్నలిస్ట్ ముచర్ల దినకర్, పల్లె నరసింహులు, ప్రముఖ కవి యాకూబ్ ముఖ్య అతిథులుగా హాజరై కవిత్వాన్ని విశ్లేషించారు. ప్రముఖ కవయిత్రులు హేమలత రెడ్డి, లక్కరాజు నిర్మల, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు విద్యానంద చార్య, శ్రీనివాస్ రాజు, రేలారే ప్రసాద్, మాపల్లె శంకర్, జ్యోత్స్న, వీణతో పాటు పలువురు కవులు, కళాకారులు, మేధావులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.