విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

  • వారం రోజుల్లో మూడు ఫిర్యాదుల పరిష్కారానికి హామీ
  • సీజీఆర్ఎఫ్ చైర్‌పర్సన్ చవాన్ జయవంత్ రావు

కడెం, ఆంధ్రప్రభ : విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్‌పీడీసీఎల్) కట్టుబడి ఉందని కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ ఫోరం (సీజీఆర్ఎఫ్) చైర్‌పర్సన్ చవాన్ జయవంత్ రావు తెలిపారు. టీజీఎన్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) రెండో సమావేశం గురువారం కడెం ఏఈఈ కార్యాలయంలో చైర్‌పర్సన్ చవాన్ జయవంత్ రావు అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సమావేశంలో కడెం, ఖానాపూర్, దస్తూరాబాద్, పెంబి తదితర సెక్షన్ల పరిధిలోని విద్యుత్ వినియోగదారులు పాల్గొని తమ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో మొత్తం మూడు ఫిర్యాదులు అందగా, వాటిని వారం రోజుల్లో పరిష్కరిస్తామని చైర్‌పర్సన్ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా, బిల్లింగ్, మీటర్లు, కొత్త కనెక్షన్లు తదితర సమస్యలు ఎదురైనప్పుడు ముందుగా సంబంధిత సెక్షన్ అధికారులను సంప్రదించాలని సూచించారు. అక్కడ సమస్యలు పరిష్కారం కాకపోయినా లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనా వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ ఫోరం (సీజీఆర్ఎఫ్)ను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు సీజీఆర్ఎఫ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని చవాన్ జయవంత్ రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సి జి ఆర్ ఎఫ్ సభ్యులు, శేర్ల సత్యనారాయణ మర్రిపల్లి రాజా గౌడ్ విద్యుత్ శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.