22apriltoon | యుద్ధం అక్కడ.. దోపిడీ ఇక్కడ!

22apriltoon| యుద్ధం అక్కడ.. దోపిడీ ఇక్కడ!

22apriltoon |యుద్ధం సాకు.. అసలు గేమ్ బ్లాక్ మార్కెట్
డెలివరీ మెసేజ్.. కానీ ఖాళీ సిలిండర్!
హోటళ్లలో రీ-ఫిల్లింగ్ దందా ఎలా?
నిఘా వ్యవస్థ ఎక్కడ..? ప్రజల సందేహాలు
సామాన్యుడి జేబుకి గ్యాస్ షాక్

22apriltoon | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఎక్కడో పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే, ఇక్కడ మన గ్యాస్ ఏజెన్సీల సిబ్బందికి భలే పంట పండినట్టుగా అనిపిస్తూంది. అక్కడెక్కడో ఇరాన్, ఇజ్రాయెల్ కొట్టుకుంటుంటే. ఆ ఇక్కడ చూపిస్తూ మన దగ్గర సిలిండర్లను దాచేసి భలే డ్రామాలు ఆడుతున్నారు. “స్టాక్ లేదమ్మా.. లోడ్ రాలేదు సార్” అంటూ వినియోగదారులకు కల్లబొల్లి కబుర్లు చెబుతూ, వెనక దారిలో మాత్రం సిలిండర్ల ఎంచక్కా దారి మళ్ళించేస్తున్నారు. యుద్ధం వల్ల గ్యాస్ రావడం లేదన్నది సాకు మాత్రమే, అసలు విషయం అది బ్లాక్ మార్కెట్‌కు మళ్లుతోందన్నది పచ్చి నిజం.

22apriltoon
22apriltoon

ఇదో వింత టెక్నాలజీ! మీ ఫోన్‌కు “సిలిండర్ డెలివరీ అయిపోయింది” అని మెసేజ్ వస్తుంది. కానీ తీరా చూస్తే కళ్ల ముందు ఖాళీ సిలిండర్ తప్ప ఏమీ ఉండదు. అంటే, మీ పేరు మీద వచ్చిన గ్యాస్‌ను అక్రమార్కులు పక్క దారి పట్టించి, డబుల్ రేటుకు అమ్ముకుని, కస్టమర్లకు మాత్రం వారం తర్వాత నిదానంగా “స్టాక్ వచ్చింది” అని నెమ్మదిగా చెబుతున్నారు. ఇదేమని ఎవరైనా నిలదీస్తే, “సర్వర్ ప్రాబ్లం” అంటూ బుకాయిస్తున్నారు.

వ్యాపార అవసరాలకు వాడే సిలిండర్ల ధరలు పెరగడంతో, హోటల్ యజమానుల కళ్లు ఇంటి గ్యాస్ సిలిండర్ల మీద పడ్డాయి. ఇంట్లో వాడే గ్యాస్‌ను హోటళ్లకు తరలించి, అక్కడ రీ ఫిల్లింగ్ దందాను యధేచ్ఛగా నడిపిస్తున్నారు. పక్కాగా ప్లాన్ వేసి, సామాన్యుడికి దక్కాల్సిన రాయితీ గ్యాస్‌ను నల్ల బజారులో సొమ్ము చేసుకుంటున్నారు. 950 రూపాయల సిలిండర్‌ను పదిహేను వందల నుంచి రెండు వేల దాకా అమ్ముతున్నా.. ‘నిఘా‘ నేత్రాలు మాత్రం నిద్ర మత్తులో ఉండటం విశేషం.

పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్ విభాగాలు ఉన్నది అక్రమాలను అరికట్టడానికా లేక అక్రమార్కులు చేసే విన్యాసాలను చూసి ఎంజాయ్ చేయడానికా అన్న సందేహం సామాన్యులకు కలుగుతోంది. హోటళ్లలో తనిఖీలు చేస్తున్నామని పేపర్ ప్రకటనలు ఇవ్వడం తప్ప, కళ్ల ముందే సిలిండర్లు మాయమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనడం వాస్తవం..ఏ ప్రభుత్వ విభాగమైనా “ఎవరైతే ఏం..కింద నుంచి పైదాకా అంతా ఒకటే” అన్న చందంగా ఉంది.

సిలిండర్ల కొరత లేదని కేంద్రం చెబుతున్నా.. అక్రమార్కులు మాత్రం “కొరత ఉంది.. ధర ఎక్కువుంది” అని జనాన్ని నమ్మిస్తూ జేబులు నింపుకుంటున్నారు. రేపు పొద్దున సామాన్యులు గ్యాస్ సిలిండర్ కొనాలంటే బ్యాంకు లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


-మాధవ్

click here to read 22ndAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

click here to read more

Leave a Reply