పాలకుడే ఇంజనీరుగా మారడంతో లక్షల కోట్లు వృధా…

పాలకుడే ఇంజనీరుగా మారడంతో లక్షల కోట్లు వృధా…

రాష్ట్రంలో నీటిపారుదల, ఇంజనీరింగ్ వ్యవస్థను పునర్నిర్మాణం చేయాలి
నియోజకవర్గంలో అదనపు ఆయకట్టు ఏర్పాటు, ఉనికిలో ఉన్న ఆయకట్టు స్థిరీకరణ, ప్రాజెక్టుల పనులపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పాలకుడే ఇంజనీరుగా మారడంతో లక్షల కోట్లు వృధా అయ్యాయని, రాష్ట్రంలో నీటిపారుదల, ఇంజనీరింగ్ వ్యవస్థను పునర్నిర్మాణం చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల వనరులు, వాటి ఉపయోగం, బ్రాహ్మణవెళ్ళాంల ప్రాజెక్టు, నూతన ఆయకట్టు ఏర్పాటు, శివన్నగూడెం రిజర్వాయర్ లోకి నీటిని తరలించే ఏదుల సొరంగ మార్గం పనులు, అప్రోచ్ కెనాల్స్, వాటికి సంబంధించిన భూసేకరణ పనులకు సంబంధించిన విషయాలపై తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజనీరింగ్ ఫోరం సభ్యులు, నీటిపారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇంతకుముందు పంచాయతీరాజ్ రోడ్డు భవనాల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ప్రాంతంగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో నీటిపారుదల వ్యవస్థ శాస్త్రీయంగా నిర్మాణం జరగలేదని, 10 సంవత్సరాల క్రితం మొదలు పెట్టిన డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులు, శివన్నగూడెం రిజర్వాయర్ పనులు ఇంకా పూర్తి కాలేదని, దానికంటే ముందు లక్ష కోట్ల రూపాయలతో ప్రారంభించిన కాలేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తయి కూలిపోవడం కూడా జరిగిందన్నారు.

నీళ్లు ఇచ్చే సోర్స్ లేకుండానే, భూ సేకరణ జరగకుండానే శివన్నగూడెం రిజర్వాయర్ కు టెండర్లు, ఎస్టిమేషన్ వేయడం, టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టడం చకచకా జరిగాయని, ఏ ప్రాజెక్టుకైనా 75శాతం నుండి 80శాతం వరకు భూసేకరణ పనులు పూర్తయిన తర్వాతనే ఇవన్నీ జరగాల్సి ఉండగా కేవలం కాంట్రాక్టర్ల కోసం, పాలకుల కమిషన్ల కోసం అధిక వడ్డీకి 5000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇక్కడ నీటిపారుదల ప్రాజెక్టులను మొదలుపెట్టారన్నారు.

దశల వారీగా, ప్రణాళిక బద్ధంగా ఖర్చు చేయాల్సిన ప్రాజెక్టును ప్రణాళికలు లేకుండా నిర్మించడం వల్ల అప్పులు అయ్యాయి తప్ప అవి ఉపయోగంలోకి రాలేదన్నారు. గత పాలనలో రాష్ట్రంలో నీటిపారుదల, ఇంజనీరింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి పాలకుడే ఇంజనీరుగా మారి ప్రాజెక్టులు కట్టడం వల్ల లక్షల కోట్ల రూపాయల అప్పులు అయ్యయన్నారు. 2014లోనే 90 శాతం పూర్తయిన బ్రాహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నీటిపారుదల ఇంజనీరింగ్ వ్యవస్థను పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఉదయ సముద్రం, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు నుండి మునుగోడు మండలంలోని కిస్టాపురం వరకు ప్రధాన ఎడమ కాలువను విస్తరించడానికి భూ సేకరణ పనులను, కాలువల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపతకన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. శివన్నగూడెం రిజర్వాయర్ లోకి నీటిని తరలించే ప్రధాన సోర్సు ఏదుల నుండి టన్నేల్ పనులను అప్రోచ్ కెనాల్స్ వాటి భూసేకరణను మొదటి ప్రాధాన్యత పనులుగా యుద్ధ ప్రాతిఫదికన పూర్తి చేయాలని అధికారులను కోరారు.

ఉదయ సముద్రం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు ద్వారా మునుగోడు మండలంలోని గ్రామాలకు సాగునీటి కల్పనతో పాటు, శివన్నగూడెం రిజర్వాయర్లోకి నీటిని తీసుకొచ్చే మార్గాలను, శివన్నగూడెం రిజర్వాయర్ నుండి వివిధ మండలాలకు వెళ్లే అప్రోచ్ కెనాల్స్ ను వాటి భూసేకరణ పనుల విషయంలో నిధులకు సంబంధించి ప్రభుత్వంతో మాట్లాడి నేను తీసుకొస్తానని, త్వరితగతిన పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులదని అన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజనీరింగ్ ఫోరం సభ్యులు శ్యాం ప్రసాద్ రెడ్డి, సత్తిరెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, ఈ ఈ లు రాములు, మనోహర్, లక్ష్మణ్, డి ఈ లు, ఏఈలు, మునుగోడు నియోజకవర్గంలోని 7మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply