వెల్దిలో పర్యటించిన ఎమ్మెల్యే కడియం

వెల్దిలో పర్యటించిన ఎమ్మెల్యే కడియం

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు, 20లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను, ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.

అందులో భాగంగానే దేశంలోనే మొట్ట మెదటి సారిగా రాష్ట్రంలోని 1కోటి 10లక్షల కుటుంబాలకు ఇందిరా భీమా పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు భీమా పథకం ద్వారా కుటుంబ పెద్ద చనిపోతే 5లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ పథకం దేశంలో మరెక్కడా లేని గొప్ప పథకం అని కొనియాడారు. వెల్ది గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని అన్నారు. వెల్ది గ్రామానికి మొదటి సారి ఎమ్మెల్యేగా ఉన్నానని తెలిపారు.

వెల్ది గ్రామంలో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండేళ్లలో అంగన్వాడీ భవనం, 18 ఇందిరమ్మ ఇండ్లు, 60లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను కలుపుకొని మొత్తంగా 1కోటి 50లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నామని తెలిపారు. రఘునాథపల్లి నుండి వెల్ది మీదుగా అశ్వరావుపల్లి వరకు గల రోడ్డు నిర్మాణానికి 14కోట్ల 25లక్షలతో ప్రతిపాదనలు పంపించానని ఇటీవలే హ్యామ్ కింద మంజూరు వచ్చిందని అతి త్వరలో ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా నిర్మించేందుకు పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

అలాగే వెల్ది ఎస్సి కాలనీ నుండి రఘునాథపల్లి వెళ్లే రోడ్డు నిర్మాణంతో పాటు వాగు పై బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత తొందరగా ఈ రోడ్డును కూడా మంజూరు చేస్తానని తెలిపారు. రెండో విడతలో అసంపూర్తిగా ఉన్న ఇండ్లకు మంజూరు ఇవ్వడంతో పాటు 20ఇల్లు మంజూరు చేస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సింగిరెడ్డి సునీత శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, వివిధ శాఖల అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.