DJ Dance Steps | యువతకు సవాల్ విసురుతున్న ఎనర్జీ వెనుక రహస్యమేంటో?
DJ Dance Steps | యువతకు సవాల్ విసురుతున్న ఎనర్జీ వెనుక రహస్యమేంటో?
DJ Dance Steps | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ పాలిటిక్స్‌లో ఎక్కడ బీఆర్ఎస్ సభ జరిగినా, అక్కడ “మల్లన్న మ్యాజిక్” కోసమే జనం ఎదురు చూస్తుంటారు. మన మల్లారెడ్డి గారు వేదిక మీద ఉన్నారంటే చాలు.. అక్కడ ఉండే జోష్ ఏ లెవల్లో ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఆయన జోకులు, స్ఫూర్తిని రగిలించే పిట్టకథలు (ముఖ్యంగా ఆ ‘కష్టపడ్డా.. సంపాదించా..పూలమ్మిన…పాలమ్మిన స్టోరీలు) ఒక ఎత్తయితే, ఒక్కసారి ఉత్సాహం పెల్లుబికితే ఆయన వేసే స్టెప్పులు ఇంకో ఎత్తు. మొన్నటికి మొన్న తన వెడ్డింగ్ యానివర్సరీలో భాగస్వామితో కలిసి ఆయన వేసిన డీజే స్టెప్పులు చూస్తుంటే.. అక్కడ డీజే దద్దరిల్లడం కాదు, యువత గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. “వయసు కేవలం అంకె మాత్రమే.. మనసు మాత్రం ఎప్పుడూ యువకుడే” అన్నట్టుగా మల్లన్న చేసే హడావుడి చూస్తుంటే కుర్రాళ్ళు కూడా కుళ్ళుకోవాల్సిందే!

ఇక ఏపీలో చూస్తే, మన జేసీ దివాకర్ రెడ్డి గారు చేసే విన్యాసాలు మామూలుగా లేవు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా జేసీ గారు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఫ్లెక్సీ మీద ఉన్న బాబు ఫోటోను ముద్దాడుతూ, అప్పట్లో ఉన్న పాతకాలపు ఎనర్జీనంతా కూడగట్టుకుని ఆయన వేసిన డాన్స్ చూస్తుంటే.. “ఏంది జేసీ గారు.. మీ లోపల ఈ యాంగిల్ కూడా ఉందా?” అని ఆశ్చర్యపోని వారు లేరు. అసలు ఆ వయసులో ఆ ఫ్లెక్సీని పట్టుకుని ఆయన వేసిన కులుకులు చూస్తుంటే, ఏదో పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలోని హీరోను గుర్తు చేశారు.
వీరినే కాదు, అప్పుడప్పుడు మన హరీష్ రావు కూడా సభల్లో కార్యకర్తల ఉత్సాహం చూసి చిన్నగా స్టెప్పులేస్తుంటారు. ఇక గతంలో చిరంజీవి పార్టీలో ఉన్నప్పుడు గంటా శ్రీనివాసరావు లాంటి నేతలు కూడా అప్పుడప్పుడు రికార్డింగ్ డాన్సుల రేంజ్ లో ఊగిపోయేవారు. రాజకీయ ఒత్తిడిని తట్టుకోవడానికి వీరు ఎంచుకున్న ఈ “డాన్స్ థెరపీ” నిజంగానే భలే ఉంది. కుర్రాళ్ళు మాత్రం జిమ్ములకు వెళ్లి కండలు పెంచుతున్నారే కానీ, వీళ్ళలాగా ఫ్రీగా బాడీని షేక్ చేయలేకపోతున్నారా…అనిపించక మానదు.
అసలు వయసు మీద పడుతున్నా ఈ నేతలకు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందబ్బా? అని అందరూ తెగ హాశ్చర్యపోతున్నారు. కొందరేమో అధికారం ఇచ్చే కిక్కు అని అంటే.. మరికొందరు మాత్రం “ప్రజల మధ్య ఉండటం వల్ల వచ్చే హుషారు” అని కవర్ చేస్తున్నారు. కారణం ఏదైనా, మల్లన్న మార్కు మ్యానరిజమ్స్, జేసీ గారి ముద్దుల డాన్సులు చూస్తుంటే రాజకీయాలు కేవలం తిట్టుకోవడానికే కాదు, అప్పుడప్పుడు మనల్ని నవ్వించడానికి కూడా ఉన్నాయని అనిపిస్తుంది. మొత్తానికి మన నేతలు మాత్రం ‘వయసై పోయినా వన్నె తగ్గని’ చందంగా పాలిటిక్స్‌లో డాన్స్ అదరగొట్టేస్తున్నారు!

