summer| తెలంగాణ‌లో ఠారెత్తిస్తున్న ఎండ‌లు

summer| తెలంగాణ‌లో ఠారెత్తిస్తున్న ఎండ‌లు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో భానుడు భ‌గ్గుమంటున్నాడు. రాష్ర్ట‌వ్యాప్తంగా ఎండ‌లు ఠారెత్తిస్తున్నాయి. ఎండ తీవ్ర‌త‌కు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇళ్ల నుంచి కాలు బ‌య‌ట పెట్టాలంటే భ‌య‌ప‌డుతున్నారు. రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం వివిధ ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్ర‌త‌లు నమోదవుతున్నాయి. గురువారం నుంచి రాబోయే మూడు రోజులు ఇదే ప‌రిస్థితి ఉంటుందని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ప‌లు జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముంది.

దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వడదెబ్బ బాధితులకు సత్వరమే చికిత్స అందించే విధంగా ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని సూచించారు. దీంతోపాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రులకు, ప్రజలకు సూచిస్తూ వైద్యారోగ్యశాఖ బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఈ సంద‌ర్భంగా ఆరోగ్యశాఖ ప‌లు సూచ‌న‌లు చేసింది. ప్రజలు మధ్నాహ్నం 12-3 గంటల మధ్య బయటకు వెళ్లకూడదు. రోజూ తగినంత ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ, టవల్​ లాంటివి ధరించాలి. ఆయిల్​, మసాలా ఫుడ్ తినడం తగ్గించాలి. వడదెబ్బ లక్షణాలు గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీ ఫ్లూయిడ్స్​, అవసరమైన మందులు సిద్ధం చేసుకోవాలి. గ్రామాల్లో ఏఎన్​ఎం, ఆశా సిబ్బంది ద్వారా ఓఆర్ఎస్​ పంపిణీ ముమ్మరం చేయాలి అని ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తోంది.

Leave a Reply