కరీంనగర్ – జగిత్యాల హైవే పనుల్లో వేగం పెంచాలి

కరీంనగర్ – జగిత్యాల హైవే పనుల్లో వేగం పెంచాలి

  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వినతి

ఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉత్తర తెలంగాణకు తలమానికంగా మారాల్సిన జాతీయ రహదారి పనుల్లో నెలకొన్న జాప్యంపై ప్రజాప్రతినిధులు కదిలారు. కరీంనగర్ నుండి జగిత్యాల వరకు సాగుతున్న ఎన్ హెచ్ 563 (NH 563) విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం కోరారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి, రహదారి పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు.

వాహనదారుల నరకయాతన..
ప్రస్తుతం ఈ రహదారిపై వాహనాల రద్దీ ఊహించని విధంగా పెరిగిపోయిందని, పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యంగా కరీంనగర్, జగిత్యాల జిల్లాల మధ్య నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, రహదారి నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యం వల్ల సామాన్య ప్రజలు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సి వస్తోందని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ప్రమాదాల నివారణే లక్ష్యం:
రహదారి పనులు అసంపూర్తిగా ఉండటం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని మేడిపల్లి సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పనులను ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతగా ప్రమాదాల తీవ్రత తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా ఈ రహదారి కీలకమని ఆయన గుర్తుచేశారు.

వెంటనే చర్యలు చేపట్టాలి:
పనుల పురోగతిని పర్యవేక్షించి, కాంట్రాక్టు సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని, అవసరమైన నిధుల విడుదల మరియు క్లియరెన్స్‌ల విషయంలో చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. పార్టీలకతీతంగా ప్రాంతీయ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే చేసిన ఈ వినతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా సానుకూలంగా స్పందించారు. సొంత నియోజకవర్గ సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించి, పరిష్కారం దిశగా అడుగులు వేయడం పట్ల స్థానిక ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతోంది.

Leave a Reply