విలేకరులపై దుర్భాషలాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

విలేకరులపై దుర్భాషలాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

అచ్చంపేట, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా భావించే విలేకరులపై దుర్భాషలాడటం అత్యంత ఖండనీయమని ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చంపేటలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలో ఒక వ్యక్తి విలేకరుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. విలేకరులు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి నిజాలను తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తారని, అలాంటి బాధ్యతాయుత వృత్తిలో ఉన్న వారిపై దాడులు, దుర్భాషలు సహించబోమని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై సంబంధిత అధికార యంత్రాంగం వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తూ, బాధ్యుడు ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని కోరారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Leave a Reply