భక్తులకు గౌరవమే ప్రథమ కర్తవ్యం..

భక్తులకు గౌరవమే ప్రథమ కర్తవ్యం..
వారించండి కానీ బాధించకండి
సేవా భావంతో సేవచేయండి
ఈఓ శీనా నాయక్
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రి క్షేత్రానికి విచ్చేసే భక్తుల పట్ల సెక్యూరిటీ సిబ్బంది గౌరవంతో, ఆప్యాయతతో వ్యవహరించాలని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ స్పష్టం చేశారు. మంగళవారం మహామండపం నాలుగో అంతస్తులో సెక్యూరిటీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో భక్తుల భద్రత, ప్రవర్తనా నియమావళి, సేవా దృక్పథంపై ఆయన సమగ్రంగా దిశానిర్దేశం చేశారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో సెక్యూరిటీ విధులు కేవలం కాపలా మాత్రమే కాకుండా పవిత్రమైన సేవగా భావించాలని పేర్కొన్నారు.
ఎన్నో ఆశలతో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులతో మర్యాదగా మాట్లాడటం ద్వారా దేవస్థాన ప్రతిష్ట పెరుగుతుందని తెలిపారు. భక్తులు దర్శనం ముగించుకుని వెళ్లేటప్పుడు వారి ముఖంలో సంతృప్తి కనిపించేలా సేవలందించాలని, దర్శనం,ప్రసాదం సక్రమంగా అందేలా సిబ్బంది సహకరించాలన్నారు. భక్తుల సంతృప్తి పెంపే ప్రధాన లక్ష్యమని గుర్తుచేశారు.

ఆలయ పవిత్రత పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని, సెల్‌ఫోన్ వినియోగం వంటి అంశాలపై నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. అదే సమయంలో భక్తులకు నచ్చజెప్పే విధంగా వ్యవహరించాలన్నారు. భక్తుల రద్దీ సమయంలో తోపులాటలు జరగకుండా క్యూ లైన్లను సమర్థంగా నిర్వహిస్తూ అందరికీ సులభ దర్శనం కల్పించాలని సూచించారు. వారించండి కానీ బాధించకండి అనే సూత్రంతో వృద్ధులు, వికలాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
విధుల్లో నిర్లక్ష్యం, యాంత్రికత సరికాదని హెచ్చరించిన ఈవో, కొంతమంది సిబ్బంది వైఫల్యం వల్ల దేవస్థానానికి చెడ్డపేరు వస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆలయం బాగుంటేనే మనమందరం బాగుంటాం. భక్తుడు సంతృప్తిగా వెళ్లినప్పుడే అమ్మవారి కృప లభిస్తుంది. ప్రతి సిబ్బంది సేవకుడిలా పని చేయాలి అని వి.కె. శీనానాయక్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రంగారావు, భద్రతా విభాగం అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.
