సీటీసీకి బెల్లంపల్లి బెస్ట్..! డీజీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

సీటీసీకి బెల్లంపల్లి బెస్ట్..! డీజీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
- పోలీస్ శిక్షణ కేంద్రానికి అన్ని విధాలా అనుకూల వేదిక
- 72 ఎకరాల సువిశాల ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌పై ఉన్నతాధికారుల దృష్టి
- నాడు మావోయిస్టుల అణచివేతకు వ్యూహాత్మక కేంద్రం.. నేడు కళ తప్పిన పరిస్థితి
- కన్నెపల్లి పర్యటనలో డీజీపీ నిర్ణయంపై జిల్లా ప్రజల ఆశలు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతిపాదిత సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (సీటీసీ) ఏర్పాటుకు బెల్లంపల్లి ముందంజలో నిలుస్తోంది. విశాలమైన స్థలం, ఇప్పటికే ఉన్న భవనాలు, పరేడ్ గ్రౌండ్ వంటి సదుపాయాలతో బెల్లంపల్లిలోని ఏఆర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ శిక్షణ కేంద్రానికి అత్యంత అనువైన వేదికగా అధికారులు భావిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా ఈ కేంద్రాన్ని శిక్షణ సంస్థగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అవి అమలు దశకు రాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లాలో పర్యటించనున్న డీజీపీ బి. శివధర్ రెడ్డి ఈ అంశం పై సానుకూల నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి నెలకొంది.

72 ఎకరాల సువిశాల ప్రాంగణం.. శిక్షణకు అనువైన వసతులు..
పోలీస్ శిక్షణ కేంద్రానికి కావలసిన మౌలిక సదుపాయాలు బెల్లంపల్లిలో ఇప్పటికే ఉన్నాయి. సుమారు 72 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఏఆర్ హెడ్‌క్వార్టర్స్లో బలమైన భవనాలు, విశాలమైన పరేడ్ గ్రౌండ్, పరిపాలనకు అనుకూల వాతావరణం ఉన్నాయి. అంతే కాకుండా ఢిల్లీ–హైదరాబాద్ ప్రధాన రైల్వే మార్గం పట్టణం గుండా వెళ్లడం, జాతీయ రహదారులతో అనుసంధానం ఉండటం వల్ల శిక్షణకు వచ్చే పోలీసు సిబ్బందికి రవాణా పరంగా కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. కొత్తగా స్థలాలు సేకరించి కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కంటే ఇప్పటికే ఉన్న వనరులను వినియోగిస్తే ప్రభుత్వానికి ఖర్చు తగ్గడమే కాకుండా బెల్లంపల్లి పట్టణానికి మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఘన చరిత్ర కలిగిన ఏఆర్ హెడ్‌క్వార్టర్స్..
బెల్లంపల్లి ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. 1980వ దశకంలో ఉత్తర తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలను అణచివేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించింది. అప్పట్లో రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉన్న పలువురు ఐపీఎస్ అధికారులు ఇక్కడే ఏఎస్పీలుగా సేవలందించారు. ఈ కేంద్రంలో 1980 నుంచి ఇప్పటి వరకు సేవలందించిన అధికారులలో పి.వి. శేషగిరిరావు (1980–81), జె.ఎన్.ఎ. దొరై (1981–82), వి. భాస్కర్ రెడ్డి (1982–84), టి.ఎ. త్యాగరాజ్ (1984–85), అబ్దుల్ ఖయ్యూం ఖాన్ (1986), పి. పున్నారావు (1986–87), టి. అశోక్ రెడ్డి (1988–90) తదితరులు ఉన్నారు.

మాజీ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి (1990–91), వి.ఆర్.కె. మోహన్ రావు (1991–92), మీర్ అహ్మద్ అలీ (1992–95), ప్రస్తుత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ (1995–96), జితేందర్ (1996–97), పి.వి. సునీల్ కుమార్ (1998) వంటి అధికారులు కూడా ఇక్కడే తమ సేవలను ప్రారంభించారు. అలాగే ప్రస్తుత డీజీపీ బి. శివధర్ రెడ్డి (1998–2000) కూడా ఈ కేంద్రంలో పనిచేశారు. తరువాత కాలంలో మహేష్ ఎం. భగవత్ (2000–01), విజయ్ కుమార్ (2001–03), ఎం.ఎస్. రవీంద్ర (2003–04), కె. రమేష్ నాయుడు (2005–08), ఎం. రమేష్ బాబు (2008–11), వి. భాస్కర్ రావు (2011–13), భాస్కర్ భూషణ్ (2013–15), ఎన్. ప్రకాష్ రెడ్డి (2015), సన్‌ప్రీత్ సింగ్ (2015), శరత్ చంద్ర పవార్ (2020) వంటి అధికారులు కూడా ఈ హెడ్‌క్వార్టర్స్ బాధ్యతలు నిర్వహించారు. ఒకప్పుడు రాష్ట్రానికి గర్వకారణమైన అధికారులతో కళకళలాడిన ఈ కేంద్రం ప్రస్తుతం నిశ్శబ్దంగా మారింది.
డీజీపీ స్పందిస్తే మారే ముఖచిత్రం..
డీజీపీ బి. శివధర్ రెడ్డి రామగుండం కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్న కన్నెపల్లిలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ పరిస్థితిపై ఆయన దృష్టి సారిస్తే సీటీసీ ఏర్పాటుకు మార్గం సుగమం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపితే వేలాది మంది పోలీసులకు ఇక్కడ శిక్షణ ఇచ్చే అవకాశం కలగడంతో పాటు పట్టణంలో వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
