ఫీజుల కోసం విద్యార్థులపై మానసిక దాడి..

ఫీజుల కోసం విద్యార్థులపై మానసిక దాడి..
- పరీక్షల సాకుతో వేధిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు
- ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయి ఆజాద్, ప్రీతం
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఫీజుల కోసం ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులపై మానసిక దాడి చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయి ఆజాద్, ప్రీతం ఆరోపించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ పెద్దపెల్లి జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని విమర్శించారు.
విద్యార్థుల భవిష్యత్తుకు నిలయాలుగా ఉండాల్సిన పాఠశాలలు కేవలం ఫీజులు వసూలు కేంద్రాలుగా మారిపోవడం విచారకరమని అన్నారు. విద్యా సంవత్సరం చివరి మాసంలో వార్షిక పరీక్షలు ఉంటాయని, సంవత్సరమంతా చదువుకున్న విద్యార్థులను ప్రోత్సహించాల్సింది పోయి ఫీజుల పేరిట వేదనకు కొన్ని ప్రైవేటు పాఠశాలలు గురి చేస్తున్నాయని మండిపడ్డారు.
ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజుల పేరుతో విద్యార్థులను వేధించడం, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం మానుకోవాలని సూచించారు. విద్యార్థులను ఫీజుల పేరుతో వేధింపులకు పాల్పడే ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
