పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ డిప్యూటేషన్ రద్దు చేయాలి

పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ డిప్యూటేషన్ రద్దు చేయాలి

పీఆర్‌టీయూ తెలంగాణ డిమాండ్

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : జడ్‌పిహెచ్‌ఎస్ బాల్కొండలో పనిచేసే పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ డిప్యూటేషన్‌ను తక్షణమే రద్దు చేసి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. 2023లో జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వుల మేరకు సంబంధిత ఇన్‌స్ట్రక్టర్‌ను జీహెచ్‌ఎస్ కోటగల్లి శంకర్ భవన్ పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపినట్లు తెలిపారు. అనంతరం 23-04-2024న తిరిగి జడ్‌పిహెచ్‌ఎస్ బాల్కొండ పాఠశాలలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, సంబంధిత ఇన్‌స్ట్రక్టర్ అక్కడికి వెళ్లకుండా శంకర్ భవన్ పాఠశాలలోనే కొనసాగుతున్నారని పేర్కొన్నారు.

12 జూన్ 2024 నుంచి ఎలాంటి విద్యాశాఖ ఉత్తర్వులు లేకుండానే నిజామాబాద్‌లోని శంకర్ భవన్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై డిప్యూటేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ 09-12-2025న విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం అందజేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. డిప్యూటేషన్ గడువు ముగిసిన తర్వాత కూడా కొనసాగడం వల్ల బాల్కొండ పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు ఈ అంశాన్ని పరిశీలించి తక్షణమే డిప్యూటేషన్ రద్దు చేసి సంబంధిత ఇన్‌స్ట్రక్టర్‌ను అసలు విధుల స్థానానికి పంపించాలని కోరారు. ఇకపై ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply