ఆశ కార్యకర్తల సేవలు అమూల్యం..

ఆశ కార్యకర్తల సేవలు అమూల్యం..

  • జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

టేకుమట్ల, ఆంధ్రప్రభ ; ప్రజారోగ్య పరిరక్షణలో ఆశా కార్యకర్తల సేవలు అమూల్యమైనవని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. మంగళవారం టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన ఆశా కార్యకర్తలకు ఆశా డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ వరకు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాటిని పక్కడ్బందీగా అమలు చేయాలని వైద్య సిబ్బందికి ఆయన సూచించారు.

ఆశా కార్యకర్తలు గ్రామ, మండల స్థాయిలో గర్భిణిలు సుఖ ప్రసవాలు జరిగేలా, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ మాతా శిశు మరణాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి ఆసుపత్రిలో ఎంతమందికి వైద్య సేవలు అందిస్తున్నారు, ఏ ఏ ప్రాంతాల నుండి వైద్య సేవలకు వస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు 70 మంది వరకు వైద్య సేవలకు వస్తున్నారని వైద్యులు తెలుపగా ఓపి సేవలు పెంచాలని సూచించారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పోషణ లోపం ఉన్న చిన్నారులు ఎంత మంది ఉన్నారు అని అడిగి తెలుసుకున్నారు.

పోషణ లోపం ఉన్న చిన్నారులు లేరని తెలుపగా అభినందించారు. గ్రామం, మండలం వారిగా పోషణ లోపం ఉన్న చిన్నారుల జాభితా తయారు చేయాలని సూచించారు. బాల్యం నుండి ఆరోగ్యవంతమైన సమాజం తయారు కావాలని స్పష్టం చేసారు. ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగహన కల్పించాలని సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ల్యాబొరేటరీని పరిశీలించి, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, పరీక్షల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ స్వరూప రాణి, ఎంపీడీవో అనిత, వైద్యులు డాక్టర్ నాగరాణి, హారిక, సర్పంచ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.