సామాజిక అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు..

సామాజిక అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు..
గవర్నర్ అబ్దుల్ నజీర్..
జేఎన్టీయూలో అట్టహాసంగా 15వ స్నాతకోత్సవం..
జేఎన్టీయూ యూనివర్సిటీ, ఆంధ్రప్రభ : సామాజిక అవసరాలకు అనుగుణంగా పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి ముందుకు తీసుకెళ్లగల బలమైన సామర్థ్యం రాష్ట్రానికి ఉందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం జేఎన్టీయూ 15వ స్నాతకోత్సవానికి గవర్నర్ ఛాన్స్లర్ హోదాలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టెస్సి థామస్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. 31 మంది విద్యార్థులకు 45 బంగారు పతకాలు, 70 మంది విద్యార్థులకు పిహెచ్డి పట్టాలు, 2025 లో బీటెక్, ఎంటెక్, ఎంఫార్మసీ చేసిన 40,782 మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా పట్టాలు అందించారు.
ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ అత్యున్నతమైన విద్య అంటే కేవలం మనకు సమాచారాన్ని అందించేదే కాదు మన జీవితాన్ని సమస్త సృష్టిలో సామరస్యంగా ఉండేలా తీర్చిదిద్దేదని రవీంద్రనాథ్ ఠాగూర్ పలికిన మాటలు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విస్తృతమైన, సంళితమైన ఉన్నత విద్యాభివృద్ధి చేస్తోందని, మహిళల భాగస్వామ్యాన్ని పెంచి జాతీయ సగటు కంటే అధికంగా 36.5 శాతం స్థూల నమోదు నిష్పత్తి, 10.93 స్థూల సూచిక తో స్థిరమైన పురోగతిని ప్రతిబింబిస్తోందన్నారు. జాతీయ విద్యా విధానం 2020 అమలులో భారతదేశం ఉన్నత విద్య, పరివర్తనాత్మక మార్పుకు నాంది పలికిందని, ఇది విద్యార్థుల అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా ఉన్నాయన్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విస్తరణ మౌలిక సదుపాయాల ఆధునికరణ సమగ్ర ఆర్థిక పునర్జీవనం దిశగా ముందుకు సాగుతోందని, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్, హార్డ్వేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆహార శుద్ధి వంటి రంగాలలో భారీ పెట్టుబడులు ఆకర్షిస్తూ మెరుగైన రహదారి నెట్వర్క్ అభివృద్ధి, అంతర్గత జలమార్గాలు పోర్టుల ఆధారత అభివృద్ధి, విమానాశ్రయాల విస్తరణ వంటి వాటికి పరిశ్రమ వాణిజ్యం కోసం ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతుందన్నారు.

విద్యార్థులకు క్రమబద్ధమైన ఇంటర్నషిప్, అవకాశాలను కల్పించడానికి, మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల ద్వారా పరిశ్రమకు సంబంధించిన కోర్సులను అందించడానికి విశ్వవిద్యాలయం కృషి చేస్తోందని, ఐఐటి మద్రాస్ ఫ్యాకల్టీ డైరెక్టర్ లతో సహా వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సహకారం ద్వారా విద్యార్థుల పారిశ్రామిక వాతావరణం భద్రత ప్రమాణాలు నియంత్రణ చట్టాలు నిత్య సమయ కార్యాచరణ పద్ధతులపై విలువైన అవగాహన పొందుతారన్నారు.

మీ జ్ఞానం మీకు మాత్రమే కాకుండా యావత్తు సమాజానికి ఉపయోగపడేలా మీరు జీవితంలో ముందుకు సాగాలని నిజాయితీ పట్టుదల కరుణ అనే విలువలతో నడవాలని పేర్కొన్నారు. నిరంతరం నేర్చుకుంటూ నూతన ఆవిష్కరణలు చేస్తూ మీరు చేపట్టే అన్ని పనుల్లోనూ శ్రేష్టత కోసం కృషి చేయాలన్నారు. మీకు జ్ఞానం సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని మీ విజయాలు మీరు చదువుతున్న విద్యాసంస్థకు గర్వకారణం కావాలన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ మధుమూర్తి, జేఎన్టీయూ ఉపకులపతి ప్రొఫెసర్ సుదర్శన్ రావు, రిజిస్టార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, ఓఎస్డి ప్రొఫెసర్ దేవన్న, పాలకమండలి సభ్యులు, డైరెక్టర్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

