అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త…

అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త…
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత జగ్జీవన్ రామ్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కొనియాడారు. జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని గొల్లపూడి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, దేశానికి ఆయన చేసిన సేవలు నిరుపమానవని అభివర్ణించారు. దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనలేని కృషిచేశారని ఉద్ఘాటించారు.
అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం పోరాడారని తెలిపారు. వారి హక్కుల కోసం ఆయన జీవితాంతం సాగించిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కొనియాడారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని బాబూ జగ్జీవన్‌రామ్ అమలు చేశారన్నారు. కుల రహిత సమాజం కోసం కృషిచేసిన మహానీయుడు బాబు జగ్జీవన్‌రామ్ అన్నారు. అన్ని వర్గాల సమానత్వాన్ని చాటి చెప్పిన జగ్జీవన్‌రామ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. భారత ప్రభుత్వం కేబినేట్లో సుదీర్ఘకాలంగా మంత్రిగా, ఉప ప్రధానిగా సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

