ఘనంగా వీడ్కోలు వేడుకలు..

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ ; సగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం కాకతీయ మహిళా ఇంజనీరింగ్ కళాశాల (కిట్స్) నాలుగో సంవత్సరం విద్యార్థినులకు వీడ్కోలు వేడుకలను మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగగా, విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన కళాశాల చైర్‌పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలకు ఉన్నత విద్య ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతుందని తెలిపారు. విద్యార్థినులు ధైర్యంగా ముందుకు సాగుతూ తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు.

సమాజంలో మహిళల పాత్ర రోజురోజుకు పెరుగుతోందని, ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో ఏఐ టెక్నాలజీ ప్రాముఖ్యత పెరిగిందని, విద్యార్థినులు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించాలని కోరారు. నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన సూచించారు.
కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సెల్వకుమార్ రాజా మాట్లాడుతూ.. విద్యార్థినుల భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ అందించామని తెలిపారు. సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ ట్రైనింగ్, ప్లేస్‌మెంట్‌కు సంబంధించిన మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహించామని, అందరూ మంచి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సహ విద్యార్థుల అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగపూరితంగా వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జె. సాయారెడ్డి, ఎస్టేట్ మేనేజర్ నాగేశ్వర్ రావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
