వానాకాలం లోపు బ్రిడ్జి మరమ్మతులు పూర్తిచేయాలి

వానాకాలం లోపు బ్రిడ్జి మరమ్మతులు చేయాలి

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు
మరమ్మతులు చేపట్టకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరిక

భీమ్‌గల్ టౌన్/రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ నుంచి బడా భీమ్‌గల్‌కు వెళ్లే ఆర్‌అండ్‌బీ బీటీ రోడ్డు, వంతెన మరమ్మతులు వెంటనే చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గత సంవత్సరం వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతిందని, వంతెన కూడా పాడైపోయిందని వారు తెలిపారు. గురువారం భీమ్‌గల్ పట్టణ, మండల బీజేపీ శాఖల ఆధ్వర్యంలో నాయకులు రోడ్డు, వంతెన పరిస్థితిని పరిశీలించి, అనంతరం స్థానిక తహసీల్దార్ కిరణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నర్సయ్య, పట్టణ అధ్యక్షుడు కనికరం మధు మాట్లాడుతూ.. గత సంవత్సరం భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెన మరమ్మతుల పేరుతో నామమాత్రపు పనులు మాత్రమే చేశారని ఆరోపించారు. మోరం పోసి పనులు పూర్తయ్యాయని చూపించారని, కానీ రహదారి సమస్య మాత్రం అలాగే ఉందన్నారు. రోడ్లపై ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

భీమ్‌గల్ మండల బీజేపీ అధ్యక్షుడు ఆరే రవీందర్ మాట్లాడుతూ.. గత వానాకాలంలో జరిగిన నష్టం తీవ్రంగా ఉందన్నారు. రోడ్లు పూర్తిగా ధ్వంసమవడంతో బడా భీమ్‌గల్, చేంగల్, సికింద్రాబాద్, గోనుగొప్పుల గ్రామాలతో పాటు పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. వంతెన దెబ్బతినడంతో దాదాపు రెండు నెలల పాటు రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు. భీమ్‌గల్ నుంచి ఆర్మూర్‌కు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో అనేక గ్రామాల ప్రజలు దూర మార్గాల ద్వారా ప్రయాణించాల్సి వచ్చిందన్నారు. వాగు నుంచి ఇసుక తరలింపుపై ఆసక్తి చూపుతున్న నాయకులు, అదే వాగుపై ఉన్న బ్రిడ్జి పరిస్థితిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఈ వానాకాలం వచ్చేలోపు రోడ్డు, వంతెనకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టకపోతే బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని నాయకులు హెచ్చరించారు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని, సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు తోట గంగాదర్, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షుడు నీలం గంగాదర్, మండల ఉపాధ్యక్షులు ఈర్ల మహేందర్, పార్థసారథి, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి చిట్టి గౌడ్, కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షుడు తక్కూరి అంజయ్య, కొట్టాల మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నవీన్, బీజేవైఎం నాయకుడు కొట్టాల అశోక్, మండల కార్యదర్శి రజినీకాంత్, సీనియర్ నాయకులు కాట్లే లింగం, ప్రశాంత్, హరిప్రసాద్, ఉప్పల నవీన్, యోగిని శ్రీనివాస్, పుండరీకం, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, శక్తి కేంద్ర ఇన్‌చార్జిలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply