కల్వరి చర్చిలో మిన్నంటిన ‘గుడ్ ఫ్రైడే’ వేడుకలు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మానవాళి పాప విముక్తి కోసం లోకరక్షకుడైన యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన పవిత్ర దినాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లిలోని కల్వరి చర్చిలో ‘గుడ్ ఫ్రైడే’ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. వేకువజాము నుండే క్రైస్తవులు పెద్ద సంఖ్యలో చర్చికి చేరుకొని ప్రత్యేక ఉపవాస ప్రార్థనల్లో పాల్గొన్నారు. సిలువపై క్రీస్తు పొందిన శ్రమలను, ఆయన చూపిన అగాపే ప్రేమను ధ్యానిస్తూ చర్చి ప్రాంగణం భక్తి పారవశ్యంతో నిండిపోయింది.

ఆకట్టుకున్న సిలువ ప్రదర్శన:
ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులు నిర్వహించిన సిలువ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యేసుక్రీస్తును బంధించడం నుండి సిలువ వేయడం వరకు జరిగిన ఘట్టాలను చిన్నారులు తమ నటన ద్వారా కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ముళ్ల కిరీటం ధరించి, కొరడా దెబ్బలు తింటూ, సిలువను మోస్తున్న క్రీస్తు పాత్రను చిన్నారులు పోషించిన తీరు భక్తులను కంటతడి పెట్టించింది. లోక పాప పరిహారార్థం దైవకుమారుడు అనుభవించిన వేదనను ప్రతిబింబించిన ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
క్రీస్తు త్యాగమే మనకు రక్షణ:
సిస్టర్ షారోన్ ఈ సందర్భంగా సిస్టర్ షారోన్ క్రైస్తవులకు వాక్య సందేశాన్ని అందిస్తూ గుడ్ ఫ్రైడే విశిష్టతను వివరించారు. క్రీస్తు చూపిన సేవా మార్గంలో నడుస్తూ, పేదలకు సహాయం చేయాలని, ద్వేషాన్ని వీడి ప్రేమతో మెలగాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చర్చి కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొనగా, చర్చి ప్రాంగణం క్రీస్తు నామస్మరణతో మారుమ్రోగింది.
