విశాఖ ఉక్కు ప్రమాదం బాధాకరం
విశాఖ ఉక్కు ప్రమాదం బాధాకరం
- టీఎన్‌టీయూసీ నేతలు
బెల్లంపల్లి టౌన్, ఆంధ్రప్రభ: విశాఖ ఉక్కు కర్మాగారంలో ల్యాడిల్ పేలుడు ఘటనలో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరమని టీఎన్‌టీయూసీ, ఎస్‌సీఎల్‌యూ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం బెల్లంపల్లిలో మృతి చెందిన కార్మికులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి టి. మణిరామ్ సింగ్ మాట్లాడుతూ, భద్రతా విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించడమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ విధానాలను నిలిపివేసి కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించి, పూర్తిగా కోలుకునే వరకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌సీఎల్‌యూ ఉపాధ్యక్షుడు గద్దెల నారాయణ, జిల్లా అధ్యక్షుడు ఓ. జీవరత్నం, టీఎన్‌టీయూసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొల్లు మల్లయ్య, కొత్తూరి నారాయణ, ఎం. గోపాల్, పుల్లూరి పోశం, ఎండీ అస్గర్ భాష తదితరులు పాల్గొన్నారు.
