ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ వ్యసనం…

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ వ్యసనం…

మహిళ హత్యకు దారి
రెండు రోజుల్లోనే కేసు ఛేదించిన పంజాని పోలీసులు
ప్రధాన నిందితుడు అరెస్ట్

పెద్దపంజాణి, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా పంజాని మండలంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ వ్యసనం కారణంగా జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. చీటీల డబ్బులు కట్టలేక, ఆన్‌లైన్ బెట్టింగ్‌లో నష్టపోయి అప్పులు తీర్చలేకపోయిన ఓ వ్యక్తి మహిళను హత్య చేసిన ఘటన కలకలం రేపింది.

పెద్ద పంజాని మండలం ఛలమంగళం పంచాయతీకి చెందిన పెద్దమిద్దెపల్లి గ్రామానికి చెందిన ఎల్. చంద్రమ్మ (33) పుంగనూరులో టైలరింగ్ పనితో పాటు చీటీలు, వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఆమె కనిపించకుండా పోవడంతో, భర్త చలపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాని పోలీసులు ‘మహిళ అదృశ్యం’ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, డిఎస్పీ డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో సీఐ బి. పరుశురాముడు, ఎస్ఐ మారెప్పల బృందం సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టింది. అనుమానితుడైన జంగాలపల్లి సుబ్రహ్మణ్యంను ముత్తుకూరు క్రాస్ సమీపంలో అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు.

విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, నిందితుడు చంద్రమ్మ వద్ద చీటీలు వేసి, రూ.40 వేల వరకు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బును ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో కోల్పోయి అప్పులు తీర్చలేకపోయాడు. చంద్రమ్మ తరచూ డబ్బులు అడుగుతుండడంతో, ఆమెను హత్య చేయాలని స్నేహితులు దేవి వరప్రసాద్, షేక్ నూర్ మహమ్మద్‌లతో కలిసి పథకం రచించాడు.

పథకం ప్రకారం చంద్రమ్మను డబ్బులు ఇస్తానని చెప్పి మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లి, తులసి మునెమ్మ గుడి సమీపంలోని మామిడి తోటలో ఇనుప రాడ్‌తో దాడి చేసి, అనంతరం కత్తితో గొంతు కోసి హత్య చేశారు. అనంతరం శవాన్ని బొలెరో వాహనంలో తరలించి జగమర్ల అటవీ ప్రాంతంలో పడవేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు జంగాలపల్లి సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

అతి తక్కువ సమయంలో కేసును ఛేదించి నిందితుడిని పట్టుకున్న పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.

ప్రజలకు హెచ్చరిక:
ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలు వ్యక్తులను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసి తీవ్ర నేరాలకు దారి తీసే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply