సాయంత్రం 7 తర్వాత నో ఎంట్రీ

సాయంత్రం 7 తర్వాత నో ఎంట్రీ

సలేశ్వరం జాతరకు కఠిన నిబంధనలు — భక్తులకు సమయ పరిమితి

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల్ల లోతట్టు అటవీ ప్రాంతంలో జరుగుతున్న సలేశ్వరం జాతరకు భక్తుల రద్దీ రోజురోజుకు అధికమవుతోంది. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు అచ్చంపేట డిఎస్పీ పల్లె శ్రీనివాసులు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని సమయానికి అనుగుణంగా ప్రణాళిక చేసుకొని రావాలని సూచించారు.

సాయంత్రం 7 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోయలోకి అనుమతి ఇవ్వబడదని హెచ్చరించారు. జాతర ముగింపు రోజైన శుక్రవారం (ఏప్రిల్ 3) భారీగా రద్దీ ఉండే అవకాశం ఉన్నందున భక్తులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం సలేశ్వరం లోయలో అధిక జనసందోహం కారణంగా ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయని తెలిపారు.

దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఈ కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాతరకు రాకపోవడమే మంచిదని, వారికి లోయలోకి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. భక్తులు అధికారుల సూచనలను పాటిస్తూ సహకరించాలని డిఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply