అమరావతి గెలుపుతో వైసీపీ భూస్థాపితం…

అమరావతి గెలుపుతో వైసీపీ భూస్థాపితం…

పార్లమెంట్ మద్దతుతో రాజధానికి మరింత బలం
ఇది రైతులందరి విజయం
శాప్ చైర్మన్ ఏ రవి నాయుడు

విజయవాడ, ఆంధ్రప్రభ : మరోసారి అమరావతి గెలుపుతో వైసీపీ భూస్థాపితం అయిందని శాప్ చైర్మన్ రవి నాయుడు విమర్శించారు. నేడు అమరావతి గెలిచిన రోజు, అదే సమయంలో వైసీపీ భూస్థాపితమైన రోజు కూడా అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధాని అమరావతి మాత్రమేనని స్పష్టం చేసిన ఆయన, రాయలసీమ ప్రజలు సైతం అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని తెలిపారు. రాజధాని అంశంలో ప్రజల అభిప్రాయం స్పష్టంగా అమరావతిపైనే ఉందన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా పార్లమెంట్‌లో దేశంలోని పలు రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. ఇది అమరావతి రైతుల దీర్ఘకాల పోరాటానికి లభించిన గౌరవమని అన్నారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం వృథా కాలేదని, వారి పోరాటానికి ఇది విజయం సాధించిన సందర్భమని తెలిపారు. మరోవైపు పార్లమెంట్ వేదికగా తెలుగుజాతి పరువును దెబ్బతీసేలా వైసీపీ ఎంపీలు వ్యవహరించారని విమర్శించారు. రాజధాని అంశాన్ని రాజకీయంగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా చూడాలని, అమరావతి అభివృద్ధి ద్వారానే రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వస్తాయని రవి నాయుడు పేర్కొన్నారు.

Leave a Reply