అమరావతికి పార్లమెంట్ ముద్ర..

అమరావతికి పార్లమెంట్ ముద్ర..
రాజధాని భవిష్యత్తుకు బలమైన భరోసా
2028 నాటికి నిర్మాణం పూర్తి లక్ష్యం
అభివృద్ధి పనులకు వేగం
విజయవాడ ఎంపీ కేసినేని శివనాద్.
ఆంధ్రప్రభ, విజయవాడ : ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి పార్లమెంటు ఆమోదముద్ర వేయడం ఎంతో శుభ పరిణామం అని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని పేర్కొన్నారు. అమరావతి రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత లభించడం రాజధాని భవిష్యత్తుకు అత్యంత కీలకమైన మైలురాయిగా పేర్కొన్నారు. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను స్పష్టంగా ప్రతిబింబిస్తోందన్నారు. 2028 నాటికి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టమైన గడువు నిర్ణయించుకోవడం అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్న సంకేతమని వెల్లడించారు. గత ఐదేళ్లుగా భూములు ఇచ్చిన రైతులు చేసిన పోరాటం, త్యాగాల ఫలితమే ఈ పురోగతి అని అభిప్రాయపడ్డారు.
అమరావతి నిర్మాణంపై ప్రతిపక్షం, ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని ఆయన తేల్చి చెప్పారు. టెక్నికల్ అంశాల పరంగా అమరావతి నిర్మాణం పూర్తిగా సురక్షితమని స్పష్టత ఇచ్చారు. ఈ ప్రగతి సాధనలో నరేంద్ర మోదీ, ఎన్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌ల సమన్వయం కీలక పాత్ర పోషించిందని ఎంపీ కేశినేని చిన్ని కృతజ్ఞతలు తెలిపారు.
