ఆదివాసి మహిళపై దాడి చేసి..

ఆదివాసి మహిళపై దాడి చేసి..
ఆళ్ళపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో పూనెం కమల అనే ఆదివాసి మహిళ పై దాడి చేయడంతో పాటుగా ఏకంగా ఆమె నివాస స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకొని దాడులకు పాల్పడిన వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆదివాసి తుడుందెబ్బ (ఆదివాసీల హక్కుల పోరాట సమితి) నాయకులు కోడెం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గిరిజనుల పై గిరిజనేతరులు చేస్తున్న దాడులు ఆపాలని, గిరిజనులకు రక్షణ కరువైందని, ఆదివాసి గిరిజన మహిళకు జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తోందని, ఆదివాసి తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు కోడెం వెంకటేశ్వర్లు అన్నారు. బాధిత మహిళ పూనెం కమలకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చూశారు. బాధిత మహిళ పూనెం కమల తన భర్త ద్వారా పొందిన 4 గుంటల ఇంటి స్థలంలోని నివసిస్తోంది. ఆమె భర్త ప్రస్తుతం తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో పోరాడుతున్నారు.
ఇటీవల అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిపోయి, గతంలో ఈ స్థలాన్ని కమల భర్తకు విక్రయించిన వారే, ఇప్పుడు తమ బంధువర్గంతో కలిసి, కొందరు వ్యక్తులతో చేతులు కలిపి కావాలనే ఘర్షణకు పాల్పడుతూ, ఆ స్థలాన్ని తిరిగి కాజేయాలనే ధోరణిలో వక్రమార్గాలను వెతుకుతున్నారన్నారు. ఒక ఆదివాసి మహిళ అని కూడా చూడకుండా, ఆమె బలహీనతను ఆసరాగా చేసుకుని భూమిని లాక్కోవాలని చూస్తూ, కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
దాడి వివరాలు..
తేదీ:26.03.2026 సాయంత్రం, సయ్యద్ రఫీ, సాబీ హున్నీసా, ఎస్.డి. మహబూబ్ పాషా, పఠాన్ పాషా మరికొందరు వ్యక్తులు అక్రమంగా ఆమె స్థలంలోకి ప్రవేశించారు. బాధితురాలిని అత్యంత అసభ్య పదజాలంతో కోయ కులం పేరు తీస్తూ దూషించి, పెద్ద రాడ్లతో భౌతిక దాడికి పాల్పడ్డారని.. ఆమెను తన సొంత స్థలం నుండి బయటకు నెట్టివేస్తూ, దౌర్జన్యంగా అక్కడ రేకుల షెడ్డు వేసి భూమిని ఆక్రమించుకున్నారని తెలిపారు.
తుడుం దెబ్బ డిమాండ్లు: ఎస్సీ/ ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద నిందితుల పై కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆదివాసి తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్న భర్త పేరు మీద ఉన్న 4 గుంటల స్థలాన్ని తక్షణమే ఖాళీ చేయించి, బాధితురాలికి అప్పగించాలని, నిందితుల వెనుక ఉన్న శక్తుల పై కూడా విచారణ జరిపి, ఆదివాసి మహిళకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలని, ఆదివాసీల భూముల పై కన్నేసి, దౌర్జన్యాలకు పాల్పడితే తుడుం దెబ్బ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
