తెలుగు ప్రజలకు అండ పసుపు జెండా….

తెలుగు ప్రజలకు అండ పసుపు జెండా….

ఏపీ సమగ్రాభివృద్ధి, పేదల అభ్యున్నతే టీడీపీ ప్రధాన లక్ష్యం.

రెడ్డిగూడెం, ఆంధ్రప్రభ : అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ దార్శనికులు సీఎం చంద్రబాబు అనుభవంతో, యువనేత, మంత్రి నారా లోకేష్ నిబద్ధతతో ఏపీ సమగ్రాభివృద్ధితో పాటు పేదల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా తిరుగులేని శక్తిగా అవతరించిందని, తెలుగు ప్రజలకు అండగా పసుపు జెండా నిలిచిందని, తరాలు మారినా టీడీపీ ఆశయాలు మారలేదని, మనమంతా ఐకమత్యంగా ముందుకు సాగటమే 44 వసంతాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనమంతా అన్న ఎన్టీఆర్ కి ఇచ్చే ఘన నివాళి అని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.

రెడ్డిగూడెం మండలంలోని ముచ్చినపల్లి గ్రామంలో అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ముచ్చినపల్లిలోనే నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో ప్రతిజ్ఞ చేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన స్థల, విగ్రహ దాతలను, టీడీపీ సీనియర్ నాయకులను, మై టీడీపీ యాప్ లో అత్యుత్తమ ర్యాంక్ సాధించిన వారిని, పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్న కార్యకర్తలను ఘనంగా సత్కరించారు.

ఈ సంధర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలపడానికి, బడుగుల చేతికి పాలనాధికారం ఇవ్వడానికి, నిరుపేదకు ఆనందంగా జీవించే హక్కును కలిగించడానికి 1982, మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీఆర్ స్థాపించారు. 44 ఏళ్లుగా టీడీపీ తెలుగు ప్రజల జీవన స్రవంతిలో భాగమైంది. సంక్షేమ రాజ్య స్థాపనలో, అభివృద్ధి బాటలో తెలుగుదేశం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, ప్రవేశపెట్టిన వినూత్న పథకాలు, నేడు యావత్ దేశానికే దిక్సూచిగా మారాయన్నారు.

టీడీపీ హయాంలో రూ.35లతో పింఛన్ పథకం మొదలైందన్నారు. దేశంలోనే పేదలకు అత్యధిక పింఛన్ సొమ్ము ఇస్తున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అన్నారు. తెలుగుగంగ నుంచి పోలవరం వరకు తెలుగుదేశం హయాంలోనే పురుడు పోసుకున్నాయన్నారు. పట్టిసం ప్రాజెక్టు కూడా డెల్టాకు జీవం పోస్తుందన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా పట్టాలెక్కిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు అన్నీ కూడా సీఎం చంద్రబాబు సారథ్యంలోనే పూర్తి అవుతాయన్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో తన తండ్రి వసంత నాగేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారని అన్నారు. అన్న ఎన్టీఆర్ తో కలసి పనిచేశారన్నారు. ఇదే టీడీపీ తన కుటుంబానికి గౌరవం, గుర్తింపు ఇచ్చిందన్నారు. నేడు తెలుగుదేశం పార్టీలో ఆయన వారసత్వాన్ని కొనసాగించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తను సొంత గూటికి చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజల కోసం పనిచేసే సరైన వేదిక తెలుగుదేశం పార్టీ అన్నారు.

మైలవరం నియోజకవర్గ చరిత్రలోనే 43 వేల మెజారిటీ ఇచ్చి తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చివరి వరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్నారు. మైలవరం నియోజకవర్గం కూడా మూడు నియోజకవర్గాలుగా విడిపోతుందన్నారు. ఏది ఏమైనప్పటికీ మనమంతా ఐకమత్యంగా ఉండి పార్టీని మరింత శక్తివంతంగా మార్చాలన్నారు. మైలవరం నియోజకవర్గ పరిధిలో ఇప్పటికి రూ.15 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ మంజూరు చేశామన్నారు.

నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి కూడా శరవేగంగా జరుగుతున్నాయన్నారు. చిన్న, చిన్న కలహాలు భూతద్దంలో పెట్టకుండా నేరుగా తనకు తెలియజేయాలన్నారు. ఒక సారి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి, మరోసారి ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయిన నవ్యాంధ్రప్రదేశ్ ను అనుభవజ్ఞులైన సీఎం చంద్రబాబు 2014 నుంచి 19 వరకు అమరావతి రాజధానిగా అభివృద్ధిలో గాడిలో పెట్టారని అన్నారు. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మూడు రాజధానుల పేరుతో అమరావతి రాజధానిని నాశనం చేయాలని చూశారని అన్నారు.

కానీ సీఎం చంద్రబాబు దృఢ సంకల్పంతో మన కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించిందన్నారు. మన రాష్ట్ర భవిష్యత్తుకు, మన బిడ్డల భవితకు సీఎం చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కుటుంబం మన మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీ శ్రేణులంతా కలసి మెలసి ఉండి 2029లో కూటమి ప్రభుత్వ విజయానికి కృషి చేయాలన్నారు. మంత్రి నారా లోకేష్ చెప్పిన విధంగా 75 ఏళ్ల వయసులో సీఎం చంద్రబాబు 25 ఏళ్ల నవయువకునిగా ఏపీ ప్రగతికి శ్రమిస్తున్నారన్నారు.

సీఎం చంద్రబాబు పరుగులు పెడుతూ తమను కూడా పరుగులు పెట్టిస్తున్నారన్నారు. ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతగా క్రమశిక్షణతో ప్రజల కోసం పనిచేసే విధంగా అందరినీ పర్యవేక్షిస్తున్నారన్నారు. ఇది చంద్రబాబు నిబద్ధత, దార్శనికతకు దర్పణం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply