HYD | ఉప్పల్‌లో కాలేజీ వేధింపుల కలకలం…
HYD | ఉప్పల్‌లో కాలేజీ వేధింపుల కలకలం…
విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు
లిటిల్ ఫ్లవర్ కాలేజీలో షాకింగ్ ఆరోపణలు… ప్రిన్సిపల్, లెక్చరర్లపై కేసు…
విద్యార్థినిపై మానసిక వేధింపులు… ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్….
లెక్చరర్ల వేధింపులపై విద్యార్థిని ఆవేదన…
ఉప్పల్, ఆంధ్రప్రభ : ఉప్పల్ పరిధిలోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్న ఒక విద్యార్థిని, కళాశాల ప్రిన్సిపల్ మరియు లెక్చరర్లపై వేధింపుల ఆరోపణలతో ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థిని బీఎస్సీ సైన్స్ మూడవ సంవత్సరం చదువుతూ, ఆరోగ్య సమస్యల కారణంగా తరచూ కళాశాలకు హాజరు కాలేకపోయినట్లు తెలిపింది. డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించి, అటెండెన్స్ ఫీజు చెల్లిస్తూ పరీక్షలు రాస్తున్నానని పేర్కొంది. విద్యార్థిని ఆరోపణల ప్రకారం, మొదటి సంవత్సరం నుంచే ప్రిన్సిపల్ మరియు కొంతమంది లెక్చరర్లు తనపై లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపింది.

రెండవ సంవత్సరం సమయంలో తన వ్యక్తిత్వంపై తప్పుగా ప్రచారం చేయడం, వ్యక్తిగత ఫోటోలను పంచుకోవడం ద్వారా అవమానానికి గురిచేసినట్లు పేర్కొంది. గతంలో ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు, కళాశాల ప్రిన్సిపల్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అనంతరం కక్షపూరితంగా కొన్ని పరీక్షల్లో ఫెయిల్ చేశారని ఆరోపించింది. ఇటీవల తిరిగి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో, ప్రిన్సిపల్ మరియు లెక్చరర్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం, మానసిక ఒత్తిడికి గురిచేయడం జరిగిందని విద్యార్థిని పేర్కొంది. ఈ పరిస్థితుల వల్ల తీవ్ర ఆందోళనకు గురైందని తెలిపింది. బాధితురాలి తల్లి మాట్లాడుతూ, తమ కుమార్తెకు న్యాయం చేయాలని, సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ప్రస్తుతం పోలీసులు ఫిర్యాదును స్వీకరించి, కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.



