Medical Services | ఏజెన్సీలో కలకలం
Medical Services | ఏజెన్సీలో కలకలం
ట్రయల్ రన్లో అదుపుతప్పిన డ్రోన్
Medical Services | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవల కోసం చేపట్టిన డ్రోన్ ప్రయోగాలు ఆందోళనకు దారితీస్తున్నాయి. అల్లూరి జిల్లాలో జరిగిన తాజా ఘటన దీనికి నిదర్శనంగా నిలిచింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం బొయితిలి గ్రామ సమీపంలో రెడ్ వింగ్ సంస్థకు చెందిన భారీ డ్రోన్ అదుపుతప్పి చెట్లలో కూలిపోయింది. ఈ డ్రోన్‌ను ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్య పరీక్షలు, సేవలను వేగవంతంగా అందించేందుకు ట్రయల్ రన్లో భాగంగా నడుపుతున్నట్లు సమాచారం.
అయితే ప్రయోగ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో డ్రోన్ నియంత్రణ కోల్పోయి చెట్లలో పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఘటన సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చినా, ఇటువంటి భారీ డ్రోన్ల వినియోగంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ సంఘటన నేపథ్యంలో డ్రోన్ ప్రయోగాల భద్రత, సాంకేతిక ప్రమాణాలపై అధికారులు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
