csk | అందుకే జట్టులోకి సంజూ

csk | అందుకే జట్టులోకి సంజూ
ధోనీకి ఈ సీజనే ఆఖరిదనే చర్చ
“తలా ఈజ్ బ్యాక్”
ధోనీ ఫుల్ ప్రాక్టీస్
నెట్ ప్రాక్టీస్‌లో సిక్సర్ల వర్షం
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐపీఎల్ ప్రారంభానికి ముందు ప్రతీసారి ధోనీ రిటైర్మెంట్ గురించి చర్చ జరగడం కామన్‌గా మారింది. ఈసారి ధోని ఆడుతాడా..? రిటైర్మెంట్ ప్రకటిస్తాడా..? అనే క్రికెట్ అభిమానులు చర్చించుకోవడం.. దానికి పులిస్టాప్ పెడుతూ ఆయన ప్రతీ సీజన్‌లో సీఎస్కే తరఫున బరిలో దిగడం జరుగుతోంది. ఈ ఏడాది కూడా ధోనీ బరిలో దిగుతున్నాడు. అయితే వచ్చే సీజన్‌కు మాత్రం అందుబాటులో ఉంటాడనే నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పటికే ధోనీ వయసు 44 ఏళ్లు. ఈ వయసులో ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించి ఏ వ్యాఖ్యతగానో… లేదా కోచ్‌గానో స్థిర పడుతారు కానీ ధోనీ మాత్రం ఐపీఎల్‌లో ఇంకా ఆడుతున్నాడు. అయితే ఈ సీజన్ ఆయనకు ఆఖరి కావొచ్చని చర్చ జరుగుతోంది. ఇతని వారసుడుగా సంజు శాంసన్ అవుతాడని.. అందుకే జట్టులోకి తీసుకున్నారని అందరూ భావిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా ధోనీకి ఇదే చివరి సీజన్ అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఓ ఈవెంట్‌లో ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ.. తన ఫిట్‌నెస్ స్థాయిలు క్రమంగా తగ్గుతున్నాయని స్వయంగా అంగీకరించాడు. మోకాలి నొప్పుల కారణంగా ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా కిందకు వస్తున్నాడు. దీనికి తోడు రాజస్థాన్ రాయల్స్ నుంచి స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్‌ను సీఎస్కే కొనుగోలు చేసుకోవడం.. ధోనీ వారసుడి వేట పూర్తయిందనే సంకేతాలను ఇస్తోంది. దీంతో ఈ 2026 సీజన్ ఎంఎస్ ధోనీకి చివరి సీజన్ కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నెల 28 నుంచి ఐపీఎల్ స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ధోనీ కూడా నెట్ ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. సీఎస్కే యువ పేసర్ ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేసే వీడియో వైరల్‌గా మారింది. అతని బౌలింగ్‌లో భారీ సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. 44 ఏళ్ల వయసులో కూడా ధోనీ తన పవర్ బ్యాటింగ్ చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. “తలా ఈజ్ బ్యాక్” అంటూ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
