Sangareddy | డ్రంక్ అండ్ డ్రైవ్‌లో హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు
Sangareddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో రోడ్డుపై హల్‌చల్ చేయడం చర్చనీయాంశమైంది.
మల్లేపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం, మద్యం సేవించిన లావణ్య కారు నడుపుతూ వెళ్తుండగా ఓ బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పటికీ అక్కడే ఆగకుండా వెళ్లిపోవడానికి ప్రయత్నించగా, అప్రమత్తమైన గ్రామస్తులు ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు.
ఈ సమయంలో లావణ్య, స్థానికుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆమెతో పాటు కారులో మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, ఆమె మద్యం సేవించినట్లు తేలింది. దీంతో పోలీసులు కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. తర్వాత లావణ్యను కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
